గోదాదేవి ‘పాశురాలు చైతన్యదీపా లు

గోదాదేవి ‘పాశురాలు చైతన్యదీపా లు

1
TMedia (Telugu News) :

గోదాదేవి ‘పాశురాలు చైతన్యదీపా లు

లహరి, డిసెంబర్19, ప్రతినిధి : గోదాదేవి పాశురాలు కేవలం గీతాలు కాదు. దైవచింతన కోసం, కర్తవ్య నిర్వహణ కోసం మనల్ని నిద్రలేపే చైతన్యదీపాలవి. ఒక్కో పాశురం ఒక్కో అమృత గుళిక. కణుపు కణుపులో చెరకుగడ తీపి పెరుగుతుందన్నట్లు మొదటి పాశురం నుంచి ప్రారంభించి, ఒక్కో పాశురం చదువుతుంటే, మనకు తెలియకుండానే మనసు పరమాత్మ పాదాల మీద వాలుతుంది. అంతటి మధురభక్తి పూరితాలుగా పాశురాలను తీర్చిదిద్దింది గోదాదేవి.ఆమె రాసిన పాశురాలు మొత్తం ముప్పై! మొదటి ఐదు ఉపోద్ఘాతం లాంటివి. తిరుప్పావై ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. భగవంతుడికి చేసే అర్చన, నివేదన సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాల్లో చెబుతుంది. భగవదారాధన వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు దండిగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పాశురాల్లో పేర్కొంది. తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి, శ్రీరంగనాథుడిని సేవించటానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి. పక్షుల కిలకిలారావాలు, అప్పుడే వికసిస్తున్న పూబాలలు, దేవాలయంలో వినిపించే చిరుగంటల ధ్వని, లేగదూడల ‘అంబా’రావాలు, వాటి మెడలో గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది.


పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి, చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన విశేషాలతో నిండి ఉంటాయి. ‘కపట నిద్ర విడిచి, లోకాల్ని కాపాడటానికి మేలుకోవయ్యా’ అంటూ రంగనాథుడికి సుప్రభాతం ఈ పాశురాల్లోనే వినిపిస్తుంది. కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది. తర్వాతి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురం ఫలశ్రుతి. ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో, వారికి భగవత్‌ కృప తప్పకుండా కలుగుతుందని అందులో హామీ ఇస్తుంది.
సాహితీ సుమగంధం
గోదాదేవి పాశురాలు కేవలం భక్తితోనే నిండిపోలేదు. అసమాన సాహితీ పాండిత్యాన్ని కూడా ఆమె తన పాశురాల్లో ప్రకటించింది. అంతకుముందు ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానాలు ఆమె పాండిత్య ప్రౌఢిమను ప్రకటిస్తాయి. సందర్భానికి తగిన శబ్ద సౌందర్యం, అలంకార శోభ పాశురాల్ని అమృతమయం చేశాయి.
ఓంగి యులగళన్ద ఉత్తమన్‌ పేర్పాడి / నాంగళ్‌ నమ్బావైక్కుచ్చాట్రి నీరాడినాల్‌ …’ అనే పాశురంలో సాహిత్యం పరమార్థాన్ని గోదాదేవి ప్రకటించింది. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు పాలను సమృద్ధిగా ఇవ్వాలి. సరిపడినంత వాన కురవాలి. అసలు ఎక్కడా, ఎందులోను ‘లేదు’ అనే పదం వినిపించకూడదు. స్వామీ! ఈ లోకాన్ని చల్లగా చూడు’ అంటూ ప్రార్థిస్తుంది ఈ పాశురంలో. ‘సహితస్య భావం సాహిత్యం’- సమాజానికి హితాన్ని చేకూర్చేదే సాహిత్యం అని అలంకార శాస్త్రవేత్తలు చెప్పినట్లు, తన సాహిత్యం ద్వారా సమాజహితాన్ని కాంక్షించి, ఉత్తమ సాహితీమూర్తిగా గోదాదేవి సాక్షాత్కరిస్తుంది.

Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి

‘నోట్రుచ్చువర్కమ్‌ పుహిగిన్రవమ్మనాయ్‌ / మాట్రముమ్‌ తారారో వాశల్‌ తిరవాదార్‌…’ అనే పాశురంలో గోదాదేవి నీలాదేవిని నిద్రలేపుతుంది. కాదు.. కాదు.. నీలాదేవి పేరుతో అజ్ఞానమనే మాయకు లోబడిన మన మనసుల్ని నిద్రలేపుతుంది. ‘నిద్ర పోవటంలో కుంభకర్ణుడు నీతో ఓడిపోయి, అందుకు ప్రతిగా తన సొత్తు అయిన నిద్రను నీకు శుల్కంగా ఇచ్చాడా ఏమి? ఇక నిద్రలేవమ్మా నీలాదేవీ!’ అని పాడుతూ ‘ఇంద్రియాలేవీ పనిచేయక, మనసు భగవంతుడి అధీనమై, ఏకేంద్రియ అవస్థలో ఉన్న గోపికను నిద్రలేవమ్మా’ అంటూ పరాచికాలాడుతుంది. ఇది బాహ్యంగా కనిపించే అర్థం. కానీ, తరచిచూస్తే… మనసుల్ని కమ్మిన మాయను తొలగించుకుంటేనే కానీ, భగవంతుడిని చేరుకోలేమన్న అంతరార్థం బోధపడుతుంది.
మొత్తంగా తన పాశురాల్లో గోదాదేవి ఎక్కడా మెట్టవేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో ఏది చెడో వివేచన చేసుకోమని హెచ్చరించింది. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచించింది. భగవత్‌ సేవకు తొందరపడాలి. క్షణం వృథా చేసినా, మన సాధన తగ్గిపోతుంది. మనకు మనంగా భగవంతుడి పాదాల మీద వాలితే, ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు. కరుణిస్తాడు. అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ‘కీళ్‌ వానమ్‌ వెళ్లెన్రు ఎరుమై శిరువీడు..’ పాశురంలో తెలియజేస్తుంది. మొత్తంగా తిరుప్పావై పాశురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారి దీపాలు. అంతిమంగా ‘శ్రీకైవల్యపదానికి’ చేరవేసే పరమపద సోపానాలు.

Also Read : రోగులకు పండ్ల పంపిణీ

గోదాదేవి మొక్కు..
ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలోని ప్రతి అక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, తిరుమంత్రాన్ని రామానుజుడు గోపురం ఎక్కి అందరికీ ఉపదేశించాడు. కులమతభేదాలు లేకుండా నారాయణుడిని చేరే జ్ఞాన వ్రత మంత్ర సాధనా సోపానాలు అందరికీ తెలియాలని ఇద్దరూ తపించారు. రామానుజుడిని తిరుప్పావై జీయర్‌ అంటారు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమైన రెండువందల సంవత్సరాల తరువాత జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడమే! అంతేకాదు, తనకు శ్రీరంగడితో వివాహమైతే మదురై దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో సుందర బాహుస్వామికి వెయ్యి బిందెల పాయసం చేయిస్తానని గోదాదేవి మొక్కుకుంది. ఆమె భగవంతుడిలో లీనం కావడం వల్ల దానిని తీర్చలేకపోయింది. ఆ మొక్కును రామానుజుడు తీర్చడం మరో విశేషం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube