చీరకొంగు అడ్డుపెట్టి 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ
-రైల్వే స్టేషన్లో ఘటన
-నిందితురాలి అరెస్ట్
టీ మీడియా, మే 23, హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఓ మహిళ 53.01 తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకుని రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన మరో మహిళ ఆమెతోపాటే లిఫ్ట్ ఎక్కింది. అక్కడ చీర కొంగు అడ్డుపెట్టి బ్యాగ్లోఉన్న ఆభరణాలు కొట్టేసింది. సుమారు 300 సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనూరాధ, రైల్వే డీఎస్పీ నరసయ్య, జీఆర్పీ సీఐ శ్రీను వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఓ ప్రయాణికురాలు 53.1 తులాల బంగారు ఆభరణాలతో కుమార్తె ఇంట జరిగే శుభాకార్యానికి వెళ్లేందుకు ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది.గేటు నెం. 4 నుంచి ప్లాట్‌ఫాం వైపునకు వెళుతుండగా, కూకట్పల్లి ఆల్విన్ కాలనీతులసీనగర్కు చెందిన ఆరూరి ప్రియ (40) ఆమెను అనుసరించింది. బాధితురాలి బ్యాగు జిప్‌ను తొలగించి అందులోని బంగారు ఆభరణాలున్న బ్యాగును తస్కరించి జారుకుంది.
Also Read : కేసీఆర్, కేటీఆర్ టూర్లపై బండి ఫైర్
బ్యాగు జిప్ తెరిచి ఉండడం గమనించిన బాధితురాలికి అందులో నగలు కనిపించలేదు. వెంటనే ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు స్టేషన్‌లోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. బాధితురాలు లిఫ్ట్‌లో వస్తుండగా, నిందితురాలు చీర కొంగు అడ్డుపెట్టి నగల బ్యాగును కొట్టేసిన దృశ్యాలు, ఆ తర్వాత బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ టీవీల్లో కనిపించాయి.దాదాపు మూడు వందల సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితురాలు కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఉంటుందని గుర్తించారు. నిందితురాలు ఇంటి వద్ద లేకపోవడంతో నిఘా పెట్టిన పోలీసులు ఈనెల 18న సికింద్రాబాద్ స్టేషన్ 4వ గేటు వద్ద ఆమె ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించిందని ఎస్పీ అనూరాధ తెలిపారు. ఆమె నుంచి రూ.6.31లక్షల విలువ చేసే 53.1 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఆమెపై కూకట్పల్లి, పేట్‌బషీరాబాద్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో దొంగతనాల కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube