గాసిప్స్’ మహా పాపం.

వాటిని చెప్పేవారు సమాజానికి చీడ పురుగులు

0
TMedia (Telugu News) :

గాసిప్స్’ మహా పాపం.

– వాటిని చెప్పేవారు సమాజానికి చీడ పురుగులు

లహరి, జనవరి 13, ఆధ్యాత్మికం : ఇతరుల గురించి పుకార్లు వ్యాప్తి చేయడం, ఇచ్చకాలు మాట్లాడడం, ఇతరులను వారి వెనకాల విమర్శించడం, తెలిసినా తెలియకపోయినా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం వంటి వాటిని ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మహా పాపంగా పరిగణించాయి. బైబిల్, ఖురాన్ తదితర మత గ్రంథాలు కూడా ఈ ధోరణిని మహాపాపం గానూ, తీవ్ర ద్రోహం గాను, అపచారంగాను భావించి, గట్టిగా ఖండించాయి. ఇంగ్లీషులో ఇటువంటి వాటిని గాసిప్స్ అని వ్యవహరిస్తారు. ఇచ్చకాలు మాట్లాడే వారిని పురాణాల్లో పంక్తి బాహ్యులుగా అభివర్ణించారు. అంటే, వీరి పక్కన కూర్చుని భోజనం చేయడాన్ని కూడా నిషేధించారు అన్నమాట. ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఇతరుల దోషాలను, లోపాలను, తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ మాట్లాడడాన్ని మహాపాపంగా బైబిల్ పరిగణించింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని, చేరదీయవద్దని బైబిల్ గట్టిగా హెచ్చరించింది.

Also Read : మనిషిలో ఈ మూడు చెడు గుణాలుంటే

స్నేహితులతోనో, బంధువులతోనో, సన్నిహితులతోనో మాట్లాడేటప్పుడు అక్కడ లేని వ్యక్తి గురించి అవాకులు, చెవాకులు మాట్లాడటం మంచిది కాదనేది వీటన్నిటి సారాంశం. గాసిప్ మాట్లాడటం అంటే అది హత్యతో, అత్యాచారంతో సమానమని, ఇతరుల గురించి విపరీతంగా అసూయపడే వారే ఇటువంటి ఇచ్చకాల మాటలకు పాల్పడుతుంటారని రామాయణం, మహాభారతం తో సహా పురాణాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి ఇచ్చకాల కబుర్లకు ఇతరులు స్పందించడాన్ని కూడా అవి మహా పాపం గానే గుర్తించాయి. ఉత్తి పుణ్యానికి ఇతరుల మీద బురద చల్లడం, ఇతరుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి, వ్యక్తిగత జీవితానికి కూడా శ్రేయస్కరం కాదని మహాభారతంలో విదురుడు చెప్పడం జరిగింది. ఇతరుల గురించి పొరపాటున తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఒక్కటే దీనికి పరిహారమని బైబిల్ స్పష్టం చేసింది. ఇతరుల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి రౌ రవాది నరకాలకు వెళతాడని, హీనమైన జన్మ ఎత్తుతాడని మహాభారతం పేర్కొంది. ఇటువంటి ఇచ్చకాల కబుర్లు చెప్పడం ఎంత పాపమో, వాటిని వినడం, ప్రోత్సహించడం కూడా అంతే పాపం అని, ఇటువంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని పురాణాలు చెబుతున్నాయి. గాసిప్స్ ను ప్రోత్సహించకపోవడం అతి గొప్ప మానవ సేవ అని ఖురాన్ పేర్కొంది. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇటువంటి గాసిప్ కబుర్లు చెప్పడం ప్రారంభించగానే వాటిని తిరస్కరించడం లేక వారిని ఆపు చేయడం చాలా మంచిది అని మత గురువులు చెబుతుంటారు. “ఇటువంటి వారికి చట్టాలన్నా, న్యాయమన్నా, పాపమన్నా భయం ఉండదు. గాసిప్స్ అనేది గుట్టు చప్పుడు కాకుండా హత్య చేయడం లాంటిది. ఇది గుండెల్ని బద్దలు చేస్తుంది. మనసుల్ని, మనుషుల్ని కుప్పకూలుస్తుంది. ఇది అమానుష వ్యవహారం. నమ్మకద్రోహానికి, దీనికి తేడా ఏమీ లేదు. సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. నిస్సహాయుల్ని దారుణంగా దెబ్బతీస్తుంది” అని చార్లెస్ కింబాల్ అనే క్రైస్తవ తత్వవేత్త స్పష్టం చేశారు. ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించే వారిని, చేరదీసే వారిని మహాపాపం జీవితాంతం వెంటాడుతుందని ఆయన హెచ్చరించారు. గాసిప్ వల్ల చోటుచేసుకునే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉంటాయని, గాసిప్ లో మునిగి తేలే వ్యక్తి ఎటువంటి దారుణానికైనా ఒడిగడతాడని చార్లెస్ కింబాల్ చెప్పారు. గాసిప్స్‌కు పాల్పడే వ్యక్తి తాను మానసికంగా చెడిపోవడమే కాకుండా, ఇతరులను కూడా మానసికంగా చెడగొడతాడని, అతను వ్యాప్తి చేసే పుకార్ల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పురాణాలు వివరించాయి.

Also Read : నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో దొంగతనం

“మంచి మనిషి హృదయంలో నుంచి మంచి మాటలే వస్తాయి. దుర్మార్గుడి మనసులోంచి దుర్మార్గ ఆలోచనలే బయటికి వస్తాయి. అతని మనసులోని ఆలోచనలను అతని నోరే పెడుతుంది” అని ఏసుక్రీస్తు చెప్పారు. గాసిప్స్ ను వ్యాప్తి చేసే వాడికంటే దుర్మార్గుడు మరొకడు ఉండడని విదురుడు వ్యాఖ్యానించాడు. మనసులో ద్వేషాన్ని నింపుకున్న వాడే గాసిప్స్ ను వ్యాప్తి చేస్తాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను విపరీతంగా మనసులో నింపుకున్న వ్యక్తి నుంచే గాసిప్స్ వ్యాపిస్తాయని మత గ్రంథాలు వివరిస్తున్నాయి. “గాసిప్స్ వల్ల నిజం కప్పబడిపోతుంది. అదొక కార్చిచ్చు లాంటిది. అది తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దహించి వేస్తుంది. అది విషంతో సమానం. దాంతో మొదట్లోనే జాగ్రత్తగా ఉండటం అన్ని విధాలా మంచిది” అని చార్లెస్ కింబాల్ మరీ మరీ చెప్పేవారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube