ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు
టి మీడియా, జూన్ 23,అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రభుత్వ వేతన స్కేల్ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రెండేండ్ల క్రితం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులకు జూలై 1 నుంచి ప్రభుత్వ వేతన స్కేల్ ప్రకారం జీతాలు అందుతాయి. ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేషన్ పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ సర్టిఫికేషన్‌ను ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది.ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్సులు నిర్ధారించబడిన క్యాడర్‌ను అనుసరించి నిర్ణయిస్తారు. జీతం చెల్లింపు ప్రక్రియపై పే స్లిప్‌ల తయారీ, ఇతర ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. తాజా పీఆర్సీ ప్రకారం ఏడాదిపాటు ఫిట్ మెంట్ నిర్ణయించి అమలు చేయనున్నారు.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్
దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరనున్నది. ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఏడీసీలుగా పదోన్నతి పొందిన డ్రైవర్లు, కండక్టర్లకు అదనపు ప్రయోజనాలపై తొలుత కొంత సందేహాలు నెలకొన్నాయి. అయితే దీనిపై ఆర్టీసి అధికారులు ఆర్థిక శాఖను సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడంతో వారికి అదనపు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగనున్నది. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విజయవాడలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అదనంగా హెచ్ఆర్ఏ చెల్లించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు దాదాపు 200 మందికి మాత్రమే హెచ్ఆర్ఏ అదనంగా చెల్లిస్తున్నారు. అయితే,ప్రభుత్వ ఉద్యోగిగా మారిన తర్వాత విజయవాడలో పనిచేసే అందరికీ అదనపు హెచ్ఆర్ లభిస్తుంది. ప్రభుత్వ పే స్కేల్‌తో భవిష్యత్‌లో తమకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్టీసీ కార్మికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube