నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతా

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

1
TMedia (Telugu News) :

నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతా

-తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

టీ మీడియా,సెప్టెంబర్ 8,హైదరాబాద్‌: ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని.. కొన్ని విషయాలు బయటకు చెప్పలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లలో మహిళా గవర్నర్‌ను వివక్షకు గురిచేశారన్నారు. ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని ఆమె ఆరోపించారు. గవర్నర్‌ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదన్నారు.

Also Read : జిల్లా అధ్యక్షులను మార్చేందుకు వై సి పి కసరత్తు

భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు..

‘‘తెలంగాణ ప్రజల కోసం కృషి చేయాలని భావిస్తున్నా. గౌవరం ఇవ్వనంత మాత్రాన నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. పేదలు, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తా. కొవిడ్‌ సమయంలో ప్రజలను ఆదుకున్నాం. ఆదివాసీల కోసం 6 గ్రామాలను దత్తత తీసుకున్నాం. గిరిజనుల ఆర్థిక పరిపుష్టి కోసం కోడి పిల్లలను పంపిణీ చేశాం. రక్తహీనత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థుల అవస్థలు, సమస్యలను గుర్తించి సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్‌క్రాస్‌ ద్వారా సేవ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందజేశాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉంది.

గవర్నర్‌ అన్నీ ఒప్పుకోవాలని లేదు..

సమ్మక్క సారక్క యాత్రకు వెళ్లినపుడు హెలికాప్టర్‌ అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజ్‌భవన్‌ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్‌ వేడుకలకూ ఆహ్వానించలేదు. శాసనసభలోనూ గవర్నర్‌ ప్రసంగాన్ని పక్కన పెట్టారు. సమస్యలు ఏమైనా చర్చించి పరిష్కరించుకోవాలి. గవర్నర్‌ ప్రతి అంశాన్నీ ఒప్పుకోవాలనో..అన్నింటినీ పక్కన పెట్టాలనో అనుకోకూడదు. రాజ్‌భవన్‌ను అవమానించారు. ఆయా అంశాలు తెలంగాణ చరిత్ర పేజీల్లో నిలిచిపోతాయి.

Also Read : వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

రాజకీయ ఉద్దేశాలు లేవు..

నేను చేపట్టిన కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత ఉద్దేశాలు లేవు. ప్రజలకు సేవ చేయకుండా నన్నెవరూ ఆపలేరు. స్నేహం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.. కానీ వ్యక్తులు, కార్యాలయాలను అవమానించడం సరికాదు. గవర్నర్‌ కనీసం రిపబ్లిక్‌ డే రోజైనా మాట్లాడకూడదా? బాసరలో విద్యార్థుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. తెలుగు వర్సిటీలోనూ అనేక సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి చేరవేశాం. గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా నా విధులు నిర్వర్తిస్తాను. నా జీవితం ప్రజల కోసమే’’ అని తమిళిసై అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube