bhadrachalam

హనీట్రాప్‌తో పోలీసు అధికారినే బురిడీయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు అరెస్ట్‌.

By ·

Share this article
హనీట్రాప్‌తో పోలీసు అధికారినే బురిడీయత్నం

హనీట్రాప్‌తో పోలీసు అధికారినే బురిడీయత్నం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు అరెస్ట్‌.

 

 

టీ మీడియా ,  అక్టోబర్ 19,  హైదరాబాద్‌:సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అందమైన యువతుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం.. యువకులతో పరిచయం పెంచుకోవడం.. వ్యక్తిగతంగా చాటింగ్‌ చేస్తూ నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించడం.. ఆపై వాటిని బయటపెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేయడం.. ఇదే ఓ సైబర్‌ నేరగాడి మోసపూరిత వ్యూహం. ఈ విధంగా పలువురిని హనీట్రాప్‌లోకి దించి రూ.25.16 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడిని సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

 

 

అమ్మాయి పేరుతో పరిచయం..

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కొండభత్తుల పవన్‌కుమార్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని సీఐటీడీలో డిప్లొమా చదువును మధ్యలోనే ఆపేసిన అతడు, తాను ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నట్లు తల్లిదండ్రులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కొన్ని సంస్థల్లో స్వల్పకాలం ఉద్యోగాలు చేసిన అతడు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

 

 

 

27 నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలు

కోల్‌కతాకు చెందిన ఓ యువతి ఫొటోలను ఉపయోగించి ‘చందన’ పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో 14, ఇన్‌స్టాగ్రామ్‌లో 13 నకిలీ ఖాతాలతో పాటు రెండు వాట్సాప్‌ నంబర్లను ఉపయోగిస్తూ వెయ్యి మందికి పైగా యువకులతో పరిచయాలు పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.మొదట అమ్మాయిగా పరిచయం చేసుకుని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం, చాటింగ్‌ ద్వారా నమ్మకం కలిగించడం, ఆపై అసభ్యకర సంభాషణలతో ఎదుటివారి నుంచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించడం నిందితుడి ప్రధాన వ్యూహంగా పోలీసులు గుర్తించారు.

 

 

 

సోదరుడి అవతారంలో బ్లాక్‌మెయిలింగ్‌

బాధితుల నుంచి ఫొటోలు, వీడియోలు సేకరించిన తర్వాత నిందితుడు మరో ఎత్తుగడకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తానే ఆ యువతి సోదరుడినంటూ బాధితులకు ఫోన్‌ చేయడం, వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపడం చేసేవాడని పేర్కొన్నారు. తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించారని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

 

 

 

రూ.25.16 లక్షల మేర నష్టం

నిందితుడు తనతో గతంలో డిప్లొమా చదివిన స్నేహితుడిని సైతం లక్ష్యంగా చేసుకుని రూ.4 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులపై లాభాలు వస్తాయని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.7 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక అంచనా ప్రకారం.. బెదిరింపుల ద్వారా రూ.18 లక్షలు, ఇతర మోసాల ద్వారా రూ.7.16 లక్షలు కలిపి మొత్తం రూ.25.16 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి మాయలో పడి 82 మంది తమ నగ్న ఫొటోలు, వీడియోలు పంపినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

 

 

 

దేశ, విదేశాలకు చెందిన బాధితులు

ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన 24 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌, టర్కీ, పాకిస్థాన్‌, కెనడా దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా ఈ మోసానికి గురైనట్లు తెలిపారు. బాధితుల్లో వైద్యులు, వ్యాపారులు, లెక్చరర్లు, ప్రైవేటు ఉద్యోగులు, డెలివరీ బాయ్స్‌, గిగ్‌ వర్కర్లు ఉన్నట్లు వెల్లడించారు.

 

 

 

ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం

నిందితుడి నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు, మూడు సిమ్‌ కార్డులు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్‌, 16 జీబీ పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన యువతి ఫొటోల వినియోగానికి సంబంధించి సంబంధిత సంస్థ, స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

 

 

 

 

 

 అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ

సైదాబాద్‌ పరిధిలో హనీట్రాప్‌ మోసాలకు పాల్పడుతున్న కొండభత్తుల పవన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు చార్మినార్‌ డీసీపీ కిరణ్‌ ఖరే వెల్లడించారు. నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో పరిచయాలు పెంచుకుని బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ కేసులో బాధితులు మొత్తం రూ.25.16 లక్షల మేర నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు.సోషల్‌ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను తెలియని వ్యక్తులకు పంపవద్దని, ఎవరైనా వాటిని బయటపెడతామని బెదిరిస్తే భయపడి డబ్బులు చెల్లించకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.