వరద విరుచుకుపడినా నిలబడిన కడెం
-చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
-ప్రాజెక్టుకు తొలిసారి ‘ఆరున్నర లక్షల’ఇన్ఫ్లో
-ప్రాజెక్టు పైనుంచి పారిన వరద అయినా తట్టుకున్న ఆనకట్ట
-కొట్టుకుపోయిన రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు
టి మీడియా,జులై15,నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది.
Also Read : పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది.
ఎన్నడూ చూడని వరద ఉధృతి
కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు.