ప్రైవేటు పాఠశాలల అధిక వసూళ్లు పదో తరగతి
-ఫైనల్ పరీక్షల ఫీజు కు రూ.1500లు అపరాధ రుసుము
టీ మీడియా ,నవంబర్ 29,హైదరాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఏదో ఒక ఫీజు పేరిట తల్లిదండ్రులపై ప్రైవేటు యాజమాన్యాలు ఆర్థిక భారం మోపుతుండగా.. తాజాగా పరీక్ష ఫీజులతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. 2023 మార్చిలో జరిగే పదో తరగతి ఫైనల్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 24తో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. ఫీజును రూ.125గా నిర్ణయించింది. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు చెల్లించొచ్చు. రూ.200తో 12 వరకు, రూ.500తో 29 వరకు చెల్లించే వీలుంది.ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగియగా.. పరీక్ష ఫీజుతో కలుపుకొని రూ.500 నుంచి రూ.1500 వరకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు వసూలు చేశాయి. ప్రైవేటు యాజమాన్యాలు అధికంగా వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు డబ్బులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అపరాధ రుసుము లేకుండా గడువు ముగిసిపోయింది.
Also Read : పంజాగుట్టలో వైఎస్ షర్మిల అరెస్ట్
ఇప్పుడు రూ.50 కలుపుకొని రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. కానీ రూ.500 వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు.*వార్షిక రుసుమూ కట్టాల్సిందేపరీక్ష ఫీజుల విషయంలో ప్రైవేటు యాజమాన్యాలపై విద్యాశాఖ ఆజమాయిషీ కొరవడింది. ఈ అదనపు వసూళ్లు గతంలోనూ ఉండేవి. కరోనా కారణంగా అడ్డుకట్ట పడింది. ఈసారి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తుండటంతో వసూళ్ల దందాకు తెరలేపాయి. స్కూలు ఫీజులను పాఠశాలలు సహజంగా రెండు, మూడు విడతల్లో కట్టించుకుంటాయి. వీటిని పదో తరగతిలో ఉన్న విద్యార్థులందరూ డిసెంబరు 15లోగా చెల్లించాలని పలు యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. లేకపోతే పరీక్ష ఫీజులను విద్యాశాఖకు చెల్లించేది లేదని, హాలు టికెట్లు జారీ కావని బెదిరిస్తున్నాయి.