మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు

మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు

1
TMedia (Telugu News) :

మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు

లహరి, డిసెంబర్20, ప్రతినిధి : మన పురాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనిషి నడవడికను పిల్లల భవిష్యత్ మార్గాన్ని నిర్దేశాన్ని చేస్తాయి. రామాయణం, మహాభారతం, చాణక్య నీతి కథలు, చిన్నయ సూరి నీతి కథలు పిల్లలు ఎలా నడుచుకోవాలి, ఎలా పెద్దలను గౌరవించాలి అన్ని నేర్పిస్తాయి. అటువంటి ఒక కథ ప్రేమతో, దయతో మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు, మనుషుల మనసులను ఎలా మార్చవచ్చు.. ఎలా మనుషులకు దగ్గరకావచ్చు తెలుసుకుందాం..

చాలా కాలం క్రితం ఓ ముసలి సన్యాసి ఒకాయన ఉండేవారు. ఆయనకు ఉన్న అద్భుత శక్తులలో ఒకటి, మానవుల తలరాతను చూడగలగటం. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసీ చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది.. పిల్లవాడి ఆయుష్యు అయిపోవచ్చింది.. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు. గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, “నాయనా! నువ్వు కొంతకాలంపాటు శలవు తీసుకొని, మీ యింటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ‌తల్లిదండ్రులతో‌ సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందర పడకు” అని చెప్పి, ఇంటికి పంపించాడు.

మూడు నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు. అయితే ఒక రోజున, గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు- ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు.. అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకూ జీవిస్తాడని అర్థమైంది.”ఏమి చేయటం వల్ల, అతని రాత ఇంతగా మారింది?” అని గురువుగారికి ఆశ్చర్యం‌ వేసింది. “నువ్వు ఇక్కడినుండి వెళ్ళావు కదా, ఆరోజునుండీ ఏమేం జరిగాయో మొత్తం చెప్పు” అన్నారు శిష్యుడితో. పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో‌చెప్పాడు; మధ్య దారిలో తను చూసిని ఊళ్ళను గురించీ, తను దాటిన పట్టణాలను గురించీ చెప్పాడు; తను ఎక్కిన కొండల గురించీ, తను దాటిన నదుల గురించీ‌ చెప్పాడు. “ఇంకా ఏమేమి విశేషాలున్నాయా ?” అడిగారు గురువుగారు.

Also Read : పాలకుడు ఇలా ఉంటే ప్రత్యర్థులకు వణుకే

శిష్యుడు కొంచెం గుర్తుచేసుకొని చెప్పాడు.. “ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది. ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ వాగు. వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలచి ఉన్నది, ద్వీపం లాగా.. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటు పోయేందుకూ వీలుకాక, ప్రాణభయంతో‌ కొట్టు మిట్టాడుతున్నది. కొద్ది సేపట్లో‌ ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది. చీమలన్నీ‌ నీటి పాలౌతాయి. నాకు వాటిని చూసి జాలి వేసింది. ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి, పట్టుకొని నిలబడ్డాను. చీమలు ఒక్కటొక్కటిగా ఆ కొమ్మమీదికి ఎక్కేసాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకూ నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను. ఆ తర్వాత నాదారిన నేను వెళ్ళాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది” అని. “ఓహో, అదన్నమాట, కారణం.. దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట” అనుకున్నారు గురువుగారు. దయతో, ప్రేమతో మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు. నిజంగానే మన రాత మన చేతల్లో ఉందని ఈ కథ ద్వారా తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube