భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టీ మీడియా, ఏప్రిల్ 25, ఇండోనేసియా : ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో సుమత్రా ద్వీపానికి పశ్చిమాన భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. ఈనేపథ్యంలో ఇండోనేసియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నది. అంతకుముందు కూడా 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఈఎంఎస్సీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 84 కిలోమీటర్ల లోతులో ప్రకపంపణలు చేటుచేసుకున్నాయని తెలిపింది. కాగా, సునామీ హెచ్చరికలతో సుమత్రా దీవుల్లో తీరప్రాంత వాసులు సముద్ర తీరానికి దూరంగా ఉండాలని అధికారులు కోరారు. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో భూకంపం తీవ్రంగా ఉందని, దీంతో ప్రజలు బీచ్‌లకు వెళ్లకూడదని సూచించారు. ఇండోనేసియాలోని కెపులౌన్ బటులో ఆదివారం ఉదయం వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట 6.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఈఎంఎస్సీ తెలిపింది. గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని వెల్లడించింది. ఈనెల 3న కూడా సుమత్రా దీవుల్లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది.