గుళ్లో సిగరెట్‌ వెలిగించి కోరుకుంటే..

గుళ్లో సిగరెట్‌ వెలిగించి కోరుకుంటే..

0
TMedia (Telugu News) :

గుళ్లో సిగరెట్‌ వెలిగించి కోరుకుంటే..

లహరి, మార్చి 9, ఆధ్యాత్మికం : ఘుమ ఘుమలాడే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం.. వంటి పలహారాలు ఏ గుళ్లోనైనా దైవానికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆలయంలో దైవాన్ని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు పండ్లు, పూలు, కొబ్బరికాయలు, సువాసనలు వెదజల్లే అగరబత్తులు తప్పనిసరిగా తీసుకొస్తారు. భక్తుల కోసం ఆలయాల వెలుపల పూలు, కొబ్బరికాయల దుఖానాలు సైతం బారులు తీరి ఉంటాయి. మన దేశంలో ఏ గుడికి వెళ్లిన కనిపించే దృశ్యం ఇది. ఐతే గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లోనున్న కటార్‌గ్రామ్‌ లో ‘వంజరా భూత్‌మామ’ ఆలయంలో మాత్రం సిగరెట్లు నైవేద్యంగా పెడతారట. అలా చేస్తే కోరికలు తీరుతాయని అక్కడి వారి నమ్మకం. ఈ గుడి బయట సిగరెట్‌ షాపులు ఒకదాని వెంబడి ఒకటి దర్శనమియ్యడం విశేషం.

ఇక్కడి దుకాణాలు నిర్వహించే యజమానులు వివిధ బ్రాండ్‌లతో ఉన్న సిగరెట్‌ ప్యాకెట్లను రోజుకు సగటున 100కుపైగా విక్రయిస్తారట. శనివారాలు, ఇతర పండుగ రోజుల్లో మాత్రం రోజుకు 250 సిగరెట్‌ ప్యాకెట్లు అమ్ముడుపోతాయని అంటున్నారు. మన దేశం మొత్తం మీద మామదేవ్ ఆలయాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి రాజ్‌కోట్‌లోని గొండాల్‌లో ఉండగా, రెండోది సూరత్‌లో ఉంది.

Also Read : ఈ దిక్కులో మొక్కలు నాటితే దరిద్రం ఇంటికి ఆహ్వానించినట్లే.

ఆలయ చరిత్ర చూస్తే..
130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం ఇక్కడ నివసించేదట. ఆ సమయంలో ఒక వంజర ఈ ప్రాంతంలో మరణించగా, అతని సమాధిని ఇక్కడ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్‌మామ అని పిలుస్తారు. క్రమంగా ఇక్కడ వంజరా భూత్‌మామ ఆలయం పుట్టుకొచ్చింది. భూత్‌మామ గుళ్లో సిగరెట్‌ వెలిగించి మొక్కుకుంటే ఆరోగ్యం, వివాహం, సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల అపారనమ్మకం. ఈ విధంగా గత 12-13 సంవత్సరాలుగా భక్తులు ఆలయంలో సిగరెట్లు వెలిగించి దైవాన్ని కొలుస్తున్నారు. అలాగే మగాస్‌ అనే మిఠాయిలు భూత్‌మామకు నైవేద్యంగా సమర్పిస్తే.. చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని, ఈ స్వీట్లను తమ వద్ద పెట్టుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమావాస్య నాడు ఆ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిజానికి భూత్‌మామను తొలుత ఓ ప్రేతాత్మగా.. ఆ తర్వాత దేవతగా నమ్మకం బలపడింది. అమావస్యనాడు భూత్‌మామ శక్తి రెట్టింపు అవుతుందని, ఆ రోజుల్లో దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. సగటున 500లకుపైగా సిగరెట్‌ ప్యాకెట్లు అమావస్యనాడు సమర్పిస్తారని ఆ ఆలయ పూజారి వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube