ఆరు గ్యారెంటీ లు అమలు భాగం ప్రజాపాలన

మంత్రులు కోమటిరెడ్డి,తుమ్మ ల పొంగులేటి,

0
TMedia (Telugu News) :

ఆరు గ్యారెంటీ లు అమలు భాగం ప్రజాపాలన

-మంత్రులు కోమటిరెడ్డి,తుమ్మ ల పొంగులేటి

టి మీడియా, డిసెంబర్ 26, ఖమ్మం : ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో మంత్రులు ప్రజా పాలన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి, జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు అన్నారు. పేద ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పథకాలు అమలుజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. పేద వారినుండి వచ్చే ప్రతి దరఖాస్తుకు సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని, పరిధికి మించితే మంత్రుల దృష్టికి తేవాలని అన్నారు. గత పదేండ్లలో రాష్ట్రంలో పేదవారికి ఇల్లు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగాలు ఇవ్వలేక పోయామన్నారు. ప్రజా పాలనలో గ్రామ సభలు చేపట్టి, సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించాలన్నారు.

Also Read : ఫాక్స్‌కాన్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందిస్తాం

మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం ఎంతో మంది మహిళలకు పనులకు వెళ్లడానికి, స్వంత అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంచి అమలు చేస్తున్నాం అన్నారు. 100 రోజులలోపే హామీలన్ని అమలు చేస్తామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారని, బాధ్యతగా, సంయమనంతో, టీమ్ గా విధులు నిర్వర్తించాలని, అధికారులు 18 గంటలు కష్టపడాలని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యమని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగు లేనప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన పై అధికారులు స్పష్టత రావాలని, కార్యక్రమం బాగుగా జరిగిందనే కీర్తి పొందాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో మంచిగా పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రభుత్వానికి అధికారులు రెండు కళ్ళని, ప్రభుత్వం పాలసీలు చేస్తే, అమలు బాధ్యత అధికారులదని అన్నారు. పథకాలు అర్హులకు అందినప్పుడే అధికారులకు తమ విధుల పట్ల సంతృప్తి కలుగుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని, డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ లోని ప్రతీ వార్డులలో సభ నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. గ్రామ సభల షెడ్యూల్ ముందస్తుగా తెలియజేయాలని, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్, నీడ కొరకు షామియానా, త్రాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజా పాలన సభ నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అధికారులు సమిష్టిగా కృషి చేస్తేనే మంచి ఫలితం ఉంటుందని, అధికారులు బాధ్యతగా తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు.

Also Read : కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు.. ఆందోళన వద్దు

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ఉదయం 8 గంటల నుండి మ. 12 గంటల వరకు, మ. 12 గంటల నుండి సా. 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ప్రజా పాలన సభలు నిర్వహిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాల్లో 481 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 114 వార్డులు ఉన్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా టీములు ఏర్పాటు చేసి, కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేస్తామన్నారు.కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ, ప్రజా పాలన సభలకు బందోబస్తు చేపట్టనున్నట్లు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. సభలలో క్యూ ల నిర్వహణలో వయోవృద్దులు, దివ్యాoగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 125 వార్డులు ఉన్నట్లు తెలిపారు. 59 బృదాలు ఏర్పాటు చేసి, రోజుకు రెండు షిఫ్టుల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, వార్డుల్లోని అన్ని కుటుంబాలని కవర్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖమ్మం జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, భద్రాచలం ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్లు డా. రాంబాబు, మధుసూదన్ రాజు, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube