చదువు
లహరి, పిబ్రవరి 25, కల్చరల్ : అనగనగా ఒక ఊరు. పేరు ప్రేమాపురం. ఆ ఊరులో ఒక పేద కుటుంబం. రత్తయ్య, జగ్గమ్మ. సంతానంగా ఒక కొడుకు మధు, కూతురు కల్పన. ఆమెకు చదువుకోవాలని కోరిక ఉండేది. కానీ వాళ్ళ నాన్న ఆమెను చదివించకూడదని అనుకున్నాడు. కొడుకును మాత్రమే చదివించాలని అనుకున్నాడు. కానీ కల్పన ఎలాగైనా చదువు కోవాలనే పట్టుదలతో ఉండేది. తన వయస్సు గల పిల్లలందరూ బడిలో చూసి, తాను చదవలేకపోతున్నందుకు బాధ పడేది. వాళ్ళు బడి నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కల్పన, వాళ్ళ నాన్నకు తెలియకుండా పిల్లల దగ్గరకు వెళ్లి చదువుకునేది.
కల్పనకు చదువు మీద ఉన్న ఆసక్తిని ఆ ఊరి పాఠాశాల ఉపాధ్యాయుడు గమనించాడు. మరుసటి రోజు కల్పన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నతో కల్పన చదువు పట్ల ఉన్న ఆసక్తి గురించి చెప్పాడు. కల్పనను బడికి పంపించమని కోరాడు. ఆయన దానికి కుదరదన్నాడు. రత్తయ్యకు అర్ధమైనట్లుగా చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. దాంతో ఆయన సరే అన్నాడు. ఆ మాటను విన్న కల్పన చాలా సంతోషపడింది. ఎప్పుడు తెల్లారుతుందా! అని ఎదురు చూసింది. అలా చూస్తుండగా కోడి కూసింది. కల్పన లేచి బడికి తయారైంది. తను ఆరోజు తన వీధిలో పిల్లలతో కలిసి పాఠశాలకు వెళ్ళింది. అలా ప్రతి రోజూ పాఠశాలకు సెలవు పెట్టకుండా వెళ్లేది. అలా కొంత కాలం గడిచింది. బడికి వెళ్ళిన కొన్నాళ్ళకే కల్పన పెద్దమనిషి (రజస్వల) అయ్యింది. అలా జరగడంతో మళ్ళీ వాళ్ళ నాన్న మనసు మారిపోయింది. కల్పనను బడి మానేయమని చెప్పాడు. పెళ్లి సంబంధాలు చూశాడు. తనకు నచ్చిన వ్యక్తిని చూసి పెళ్లి చేశాడు. నాన్న మాటకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత కల్పనకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని తనలా కాకుండా బాగా చదివించాలనుకుంది. కానీ వాళ్ళ భర్త, అత్తయ్య, మామయ్య కుతుర్ని చదివించకూడదని అనుకున్నారు. కానీ కల్పన మాత్రం వాళ్ళతో గొడవపడి మరీ తన కూతుర్ని చదివించింది.
Also Read : బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచుకుంటే?
ఆమె బాగా చదువుకుని కలెక్టర్ అయ్యింది. తనవల్ల కాలేని పనిని తన కూతురి రూపంలో సాధించడంతో కల్పన ఎంతో సంతోషించింది. అలా చదువుపట్ల కల్పన తన కోరికను నెరవేర్చుకుంది. ఇక మనం కూడా రత్తయ్యలా కాకుండా, కల్పనలాగా ఆలోచించాలి.
– గంధవరపు పల్లవి కలాం
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బొద్దాం,
93918 14366