శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం..
– రోజుకు 1.70 లక్షల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
టీ మీడియా, అక్టోబర్ 11, విజయవాడ : అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పత్రి సెకనుకు ఇద్దరు, ముగ్గురు భక్తులు దర్శించుకోవచ్చని వెల్లడించారు. రోజుకు 4 గంటలు పూజలు, నివేదనలు, 20 గంటలపాటు భక్తుల దర్శనాలు ఉంటాయన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రొటోకాల్ ఉన్నవారు స్వయంగా వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 15న ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. 23న విజయదశమి రోజున 10.30 గంటలకు పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజైన ఆదివారం.. స్నాపనభిషేకం అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆరోజున బాలాత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. 16న గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read : ప్రపంచ ఆర్థికాభివృద్ధికి, ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్
ఇక నవరాత్రుల్లో నాలుగో రోజైన 18వ తేదీన మహాలక్ష్మి దేవిగా, 19న లలితా త్రిపుర సుందరి దేవిగా కొలువుదీరనున్నారు. నవరాత్రుల్లో ఆరో రోజు అక్టోబర్ 20న మూలా నక్షత్రంలో దుర్గమ్మ సరస్వతి దేవిగా, 21న కనకదుర్గ దేవిగా, 22న మహిషాశుర మర్దినిగా, నవరాత్రుల్లో చివరి రోజు 23న రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. అయితే మొదటి రోజు అమ్మవారి స్నాపనభిషేకం అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకునే వీలుకల్పించామన్నారు. మిగతా రోజుల్లో తెల్లవారు జామున 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభంమవుతాయని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజైన 20వ తేదీన సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని తెల్లవారు జామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శించుకోవచ్చని వెల్లడించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube