దుర్గ గుడిలో అనధికారిక పులిహోర అమ్మకాలపై విచారణ
లహరి, ఫిబ్రవరి 21,విజయవాడ : విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో రసీదుల్లేకుండా జరుగుతున్న పులిహోర అమ్మకాలపై ఆలయ ఇఒ భ్రమరాంభ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం పులిహోర కుంభకోణానికి సంబంధించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంటు నగేష్‌ను విచారణాధికారిగా నియమించారు. విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మహిళా ఉద్యోగిని గతంలో ఎసిబి సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను రెండు రోజుల్లో అందించాలని, నివేదిక అందిన వెంటనే ఇందుకు సంబంధించిన వారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తుందని ఆలయ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. పులిహోర కుంభకోణం గురించి పలువురు యాత్రికులు దేవాదాయశాఖ కమిషనరు హరి జవహర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆలయ ఇఒ విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై దేవాదాయశాఖ మంత్రి కె సత్యనారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.