రైలు ప్ర‌మాద బాధితుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌..

- అన్నివిధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా

0
TMedia (Telugu News) :

రైలు ప్ర‌మాద బాధితుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌..

– అన్నివిధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా

– సత్వరమే ఎక్స్‌గ్రేషియా అందించండి

– అధికారులకు సిఎం జగన్‌ ఆదేశం

టీ మీడియా, అక్టోబర్ 30, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కంకటాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులుగా ఉన్న క్షతగాత్రులను సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వాస్తవానికి సిఎం పర్యటనలో భాగంగా తొలుత ప్రమాద జరిగిన ఘటన స్థలానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ రైల్వే అధికారుల వినతి మేరకు ఆయా పర్యటనను సిఎంవో అధికారులు రద్దు చేశారు. సిఎం పర్యటనకు వస్తే ఆయా ప్రాంతంలో పునరుద్దరణ పనులు మరింత ఆలస్యమవుతాయనే విషయాన్ని రైల్వే అధికారులు సిఎం దృష్టికి తీసుకువెళ్లారు, దీంతో సిఎం జగన్‌ విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా విజయనగరం హెలికాప్టర్‌లో చేరుకుని, జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి ధైర్యాన్ని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగానే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రతి క్షతగాత్రునికి మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పూర్తిగా కొలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్నారు. అదే విధంగా మృతిచెందిన కుటుంబాటలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సిఎం పర్యటనలో భాగంగా ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ఆసుపత్రి ఆవరణలో ప్రమాద ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటోలను తిలకించి, ప్రమాదం జరిగిన తీరును రైల్వే, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ 13 మందిని మృతులుగా గుర్తించామని, 62 మంది క్షతగ్రాతులకు ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నట్లు సిఎం జగన్‌కు విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మీ తెలియజేశారు.

Also Read : కేసీఆర్ సభ పనులను పరిశీలించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అంతకు ముందు విజ‌య‌వాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్ కు విమానంలో చేరుకున్న జ‌గ‌న్ కు అక్క‌డ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ డా. ఎ.రవి శంకర్, జీవిఎంసి కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ , పార్లమెంటు సభ్యులు ఎం వి.వి. వి. సత్యనారాయణ, బి.సత్యవతి, డిసిసిబి చైర్మన్ కోలాగురువులు, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆర్డీవో హుస్సన్ సాహెబ్, తహశీల్దార్ జయ , పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ విచ్చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube