వైభవంగా కొనసాగుతున్న కార్తిక బ్రహ్మోత్సవాలు
టీ మీడియా, నవంబర్ 16, తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయని, అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలని అన్నారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసమని వివరించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు ఉష్ణపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.
Also Read : పది బిల్లులను వెనక్కిపంపిన తమిళనాడు గవర్నర్
వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, వీజీవో బాలిరెడ్డి సూపరింటెండెంట్ శ్రీ వాణి, ఆలయ అర్చకులు బాబు స్వామి , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube