ఆన్‌లైన్‌ టికెట్ల విధానం ద్వారా కీసరగుట్టలో స్వామివారి దర్శనం

మంత్రి మల్లారెడ్డి

0
TMedia (Telugu News) :

ఆన్‌లైన్‌ టికెట్ల విధానం ద్వారా కీసరగుట్టలో స్వామివారి దర్శనం

– మంత్రి మల్లారెడ్డి

లహరి, ఫిబ్రవరి 3, హైదరాబాద్‌ : మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం నుంచి భక్తులకు ఆన్‌లైన్‌ టికెట్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసరగుట్టలోని కల్యాణ మంటపంలో జాతర ఏర్పాట్లపై గురువారం ఆలయ నిర్వాహకులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు.

నగరానికి అతి చేరువలో ఆలయం ఉండడంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 5 నుంచి 7లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంవత్సరం పాసుల బదులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. స్వామివారి దర్శనం రూ.500, అభిషేకానికి రూ.800, కల్యాణోత్సవం రూ.1200లను ఆన్‌లైన్‌ద్వారానే చేసుకొనే వెసులుబాటును కల్పించామన్నారు.యాదాద్రి తరహాలో కీసరగుట్ట ఆలయంలో కూడా స్వామివారికి ఫోన్‌పే, స్కానింగ్‌ ద్వారా విరాళాలు అందజేయవచ్చని సూచించారు. బ్రహ్మోత్సవాల కోసం రూ.కోటి మంజూరు చేయాలని కోరగా సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి స్పష్టం చేశారు.

Also Read : 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

కీసరగుట్టకు సంబంధించిన వెబ్‌సైట్‌ను, ఫోన్‌పేలను, ఆన్‌లైన్‌ సిస్టమ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ చైర్మన్‌ తటాకం రమేశ్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోలీసు, ఆర్‌అండ్‌బీ, సానిటేషన్‌, ట్రాఫిక్‌, హెల్త్‌, సాంస్కృతిక శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి కీసరగుట్ట గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహరెడ్డి, అభిషేక్‌ ఆగస్త్య, డీసీపీ జానకీ, కీసర ఆర్డీవో రవికుమార్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube