కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేత‌

కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేత‌

1
TMedia (Telugu News) :

కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేత‌

టీ మీడియా,సెప్టెంబర్ 02, హైద‌రాబాద్ : కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని, ఆపరేషన్‌ చేసిన సర్జన్‌ లైసెన్సును తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తాత్కాలికంగా రద్దు చేసిందని తెలంగాణ‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెప్పారు.

 

Also Read : ఉచితల పేరిట పింఛన్లను రద్దు చేసే కుట్ర

ఆగ‌స్టు 25వ తేదీన ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో ‘డబుల్‌ పంక్చర్‌ లాప్రొస్కొపి’ (డీపీఎల్‌) విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. నిపుణులైన సిబ్బంది మొత్తం 34 మందికి సర్జరీ చేశారు. నలుగురికి విరేచనాలు, వాంతులు వంటి గ్యాస్ట్రో సంబంధ సమస్యలు తలెత్తాయని, సమీప దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతుండగా మరణించిన‌ట్లు డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల నగదు, డబుల్‌ బెడ్‌రూం ఇస్తామని హామీ ఇచ్చారని, వారి పిల్లల చదువు బాధ్యతను సైతం ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. మిగతా 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను వారి ఇంటికి పంపించి పరీక్షలు చేశామని పేర్కొన్నారు. జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న 9 మందిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. మిగతావారి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో కు.ని ఆపరేషన్లకు 2016 నుంచే టార్గెట్లు తీసేశామని, వారంతా స్వచ్ఛందంగా వచ్చారన్నారు. కు.ని సాధారణ శస్త్రచికిత్స అని, గతేడాది రాష్ట్రంలో 1.10 లక్షల మందికి ఆపరేషన్లు చేశామని వివరించారు. ఇందులో డీపీఎల్‌ పద్ధతిలో 24,233 సర్జరీలు జరిగాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారమే ఆపరేషన్లు, సిబ్బంది శిక్షణ జరుగుతున్నదని అన్నారు. అయినా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పురుషులు వేసెక్టమీపై దృష్టిసారించాలని కోరారు. రాష్ట్రంలో 3 శాతం మంది మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకుంటున్నారని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube