పోడు భూముల సర్వే వేగవంతం చెయ్యాలి

- అడవులు సంరక్షణ ముఖ్యం

2
TMedia (Telugu News) :

పోడు భూముల సర్వే వేగవంతం చెయ్యాలి

– అడవులు సంరక్షణ ముఖ్యం

-అధికారులు తో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

టీ మీడియా,అక్టోబర్ 22,భద్రాద్రి కొత్తగూడెం : పోడు భూముల సర్వే ప్రక్రియ నిర్వహణతో పాటు అడవుల సంరక్షణ కూడా చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి పోడు భూముల సర్వే ప్రక్రియ, నూతనంగా అడవుల నరికివేత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రెవిన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీరాజ్, సర్పంచులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియ ప్రారంభంలో మంచిగా జరిగినప్పటికీ రాను రాను చాలా నెమ్మదిగా జరుగుతున్నదని వేగవంతం చేయాలని చెప్పారు. పోడు భూముల సర్వే ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని చెప్పారు. 332 గ్రామ పంచాయతీలలో పోడు భూముల సర్వే నిర్వహణకు అటవీ, రెవిన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులతో టీములు వేసినట్లు చెప్పారు. పోడు సర్వేతో పాటు అడవులు నరికివేతకు పాల్పడే వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. అడవుల సంరక్షణలో సర్పంచుల బాధ్యత చాలా ప్రధానమైనదని చెప్పారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, అటవీ అధికారులు అడవుల సంరక్షణకు కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. నూతనంగా అడవులు నరికివేతకు పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ పరంగా లభించే అన్ని పథకాలను రద్దు చేయడం జరుగుతుందని, కొట్టిన చెట్లకు సంబంధించి రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్థులు జప్తు చేయడం జరుగుతుందని చెప్పారు.

Also Read : నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు

సర్వే ప్రక్రియ నిర్వహణలో కానీ అడవుల నరికివేతలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజా ప్రతినిథులు కానీ, ప్రభుత్వ సిబ్బంది కానీ భాగస్వాములైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోడు సర్వేను ఆసరాగా తీసుకుని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, పినపాక మండలాలలో అడవుల నరికివేత జరుగుతున్నదని పటిష్ట పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య సృష్టించే వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయాలని, అటువంటి వారి వల్ల సర్వే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. సర్వే ప్రక్రియ నిర్వహణలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అదేవిధంగా అడవుల సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. అడవులు సంరక్షణకు గ్రామస్థాయి నుండి పటిష్ట పర్యవేక్షణ జరగాలని ఇందుకు విఆర్డీలను, గ్రామ పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో అటవీ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్జ్, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు, అటవీ అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube