మన్ కీ బాత్ కాదు, మౌన్ కీ బాత్ తెలియజేయాలి
– జైరామ్ రమేశ్
టీ మీడియా, ఏప్రిల్ 25, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి ప్రత్యేకత ఉండాలని సూచించారు. ఈ 100వ ఎపిసోడ్‌లో ప్రధాని మన్ కీ బాత్ కాకుండా, మౌన్ (మౌనం) కీ బాత్ తెలియజేయాలని జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అదానీ అంశంపైన, చైనాతో సరిహద్దు సమస్యలపైన, సత్యపాల్ మాలిక్ ఆరోపణలపైన, వీూవీజుల విధ్వంసంపైన, పలు ఇతర అంశాలపైన మాట్లాడలేక మౌనం వహిస్తున్నారని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఈ నెల 30న ప్రసారం కాబోయే 100వ మన్ కీ బాత్‌లో ప్రధాని వివిధ అంశాలపై మౌన్ కీ బాత్ తెలియజేయాలన్నారు. కాగా, ప్రధాని మోడీ 2014, అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం రోజున మన్ కీ బాత్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆలిండియా రేడియోలో ప్రసారమవుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటివరకు 99 ఎపిసోడ్‌లు ముగియగా, ఈ నెల 30న నిర్వహించేది 100వ ఎపిసోడ్.