బరితెగించిన మెడికల్ మాఫియా

పలు రకాల పరీక్షల పేరుతో భారీగా రోగుల నుంచి దోపిడీ

0
TMedia (Telugu News) :

బరితెగించిన మెడికల్ మాఫియా

– పలు రకాల పరీక్షల పేరుతో భారీగా రోగుల నుంచి దోపిడీ

– వైరల్‌ జ్వరానికి సైతం మలేరియా, డెంగ్యూ పరీక్షలు

– అనుమతులు లేకుండానే ల్యాబ్‌లు, శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు నిర్వహణ

– అర్హత లేని వ్యక్తులతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు

– తప్పుడు రిపోర్టులతో రోగుల ప్రాణాలకు ముప్పు

– కొరవడిన వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు

టి మీడియా, జనవరి 3, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా కేంద్రంతో సహా కోదాడ, హుజూర్ నగర్ ఇతర పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు వైద్యులు, డయోగ్నస్టిక్‌ కేంద్రాలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, రోగుల నుంచి అందినంత దోచేస్తున్నారు. వైరల్‌ జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితులకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్‌ లేకపోతే.. ఫలానా ల్యాబ్‌కు వెళ్లాలని సిఫారసు చేస్తున్నారు. ఇక ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు నిర్ణీత ఫీజులకన్నా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల కనీస పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో ప్రైవేటు వైద్యులు, ల్యాబ్‌లు, డయోగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రోగులు నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
ల్యాబ్‌లలో టైఫాయిడ్‌, మలేరియా నిర్ధారణ పరీక్షలకు రూ.100 నుంచి రూ.150 తీసుకోవాల్సి ఉండగా ఇష్టారీతిలో చార్జీలు వసూలు చేస్తున్నారు. డెంగ్యూబారిన పడితే రక్త పరీక్షకు (ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌) రూ.800 నుంచి రూ.1000, తైరాయిడ్‌ పరీక్షకు రూ.600 వరకు వసూలు చేస్తున్నారు.

Also Read : పేదలకు ఎంపీ నామ ఆర్థిక చేయూత

జిల్లాలో అనుమతులు లేని ల్యాబ్‌లే ఎక్కువ :
జిల్లాలో వైద్య,ఆరోగ్య శాఖ అనుమతితో క్లినిక్‌లు, ల్యాబ్‌లు/ డయోగ్నస్టిక్‌ సెంటర్లు, పాలీక్లినిక్‌లు, ఆస్పత్రులు నడవాలి. కానీ ఎటువంటి అనుమతులు లేని డయోగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు,ఆస్పత్రులు రెట్టింపు సంఖ్యలో వున్నాయి. వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కుమ్మక్కై.. అవసరం లేని వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ల్యాబ్‌ల నిర్వాహకులు పరీక్ష ఫీజుల రూపంలో వసూలు చేసే సొమ్ములో 20 నుంచి 40 శాతం వరకు సంబంధిత వైద్యులకు కమిషన్‌గా అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. కొంతమంది రక్త పరీక్షల పేరుతో అనుమతులు లేకుండా ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వీటిపై గతంలో అనేకమంది ఫిర్యాదు చేసినా అధికారులకు పట్టించుకోలేదు.

Also Read : వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా

అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు :
జిల్లాలో పలు ల్యాబ్‌లను పేథాలజిస్టులు లేకుండానే నిర్వహిస్తున్నారు. మరికొన్ని ల్యాబ్‌లలో కనీస అర్హతలు లేనివారు నియమించుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వైద్య పరీక్షకు అయ్యే ఖర్చులకు సంబంధించి ల్యాబ్‌లో అందరికీ కనిపించేలా ధరల పట్టికలను ఏర్పాటు చేయాలి. ల్యాబ్‌లో పనిచేసే అసిస్టెంట్‌, పేథాలజిస్ట్‌ ఫొటోతో ఉన్న విద్యార్హత ధ్రువపత్రాన్ని రిసెప్షన్‌ వద్ద ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లో ఇవేవీ కనిపించవు. జిల్లాలో చాలా మంది వైద్యులు ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి పొంది ల్యాబ్‌లను, మెడికల్ షాపులను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు కొరవడిన కారణంగానే మెడికల్ మాఫియా ఇలా రెచ్చిపోతుందని, ఇప్పటికైనా సంబందిత అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube