ప్రాణహిత పుష్కారాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రాణహిత పుష్కారాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

2
TMedia (Telugu News) :

ప్రాణహిత పుష్కారాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

టీ మీడియా, ఏప్రిల్ 14, హైదరాబాద్‌ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం చేశారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, జడ్పీ చైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తుమ్మిడిహేట్టి పుష్కర స్నానాల ఘాట్ల వద్ద కార్తీక మహారాజ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఘాట్ల వద్ద పుష్కర పుణ్య స్నానాలు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రారంభించారు.ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ప్రాణహిత పుష్కరాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన

తెలంగాణలోనే పుట్టి ఇక్కడే ముగిసే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది. కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టికి పైభాగంలో పెన్‌గంగ, వార్ధా నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. అవతలి వైపు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేసింది.
ప్రాణహిత ప్రాశస్త్యం..
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద పుట్టిన ప్రాణహిత నది రాష్ట్రంలో సుమారు 113 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. మహారాష్ట్రలో పుట్టిన వార్దా, పెన్‌గంగా నదుల సంగమంతో జీవనదిగా విరాజిల్లుతున్నది. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి త్రివేణి సంగమంగా ప్రత్యేకతను సంతరించుకున్నది. అవతలివైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దుగా ఉంది. గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ప్రాణహిత గోదావరి బేసిన్‌లో 40 శాతం నదీజలాల వాటా కలిగి ఉంది. ఇంతటి ప్రాచుర్యం గల ప్రాణహిత పుష్కరాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. నదీతీరంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. పుష్కరాలు నిర్వహించే 12 నదుల్లో ఒక్కటైన ప్రాణహిత ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రణీత మహాముని ఇక్కడ తపస్సు చేయడంతో ఈ నదికి ఆయన పేరు కలిసేలా ప్రాణహితగా స్థిరపడిందని ప్రతీక. నదీతీరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాణులతో ఈ పేరు వచ్చిందని మరో ప్రశస్తి కూడా ఉంది.

Also Read : కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రత్యేక బస్సులు
ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 13 నుంచి 24 వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌ నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు బస్సులు నడుస్తాయి. మంచిర్యాల నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు రూ.120, చెన్నూరు నుంచి అర్జునగుట్ట, సిరోంచకు రూ.55 బస్సు చార్జీలు వసూలు ఉంటాయి. అలాగే మంచిర్యాల, చెన్నూరు నుంచి కాళేశ్వరం వరకు అదనపు బస్సులు నడువనున్నాయి. ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన నాలుగు బస్సులను కౌటాల నుంచి తుమ్మిడిహట్టి వరకు ప్రత్యేకంగా నడుపుతున్నారు. బస్సు చార్జి రూ.40లు ఉండనుంది. హైదరాబాద్‌ నుంచి కౌటాల వరకు రోజు రాత్రి 7.30 గంటలకు ప్రత్యేకంగా సూపర్‌ లగ్జరీ నడుపుతున్నట్లు తెలిపారు. 30 మంది ప్రయాణికులకు ఒకే చోట నుంచి పుష్కరాలకు వెళ్లదలచి నట్టయితే వారి కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube