విపక్షాలకు చెక్ పెట్టేలా మోదీ వ్యూహం

-బీజేపీ నయా టార్గెట్

0
TMedia (Telugu News) :

విపక్షాలకు చెక్ పెట్టేలా మోదీ వ్యూహం

-బీజేపీ నయా టార్గెట్

టి మీడియా, డిసెంబర్ 26,ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుస విజయాలకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమి ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదునుపెట్టారు. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటుబ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతిచోటా 50 శాతం లేదా ఆపై ఓట్లను కైవసం చేసుకోవాలి. మరి ఇది సాధ్యపడేనా? బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ గంపగుత్తగా కూడగట్టి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న విపక్ష కూటమి వేస్తున్న ఎత్తులను ఈ పైఎత్తు చిత్తు చేస్తుందా? గత ఎన్నికల గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఓసారి లోతుగా పరిశీలించి, విశ్లేషిద్దాం.

Also Read : లోక్‌సభ క్లీన్‌స్వీప్‌ టార్గెట్‌గా బీఆర్ఎస్ అడుగులు

విపక్షాల ‘ఉమ్మడి’ అభ్యర్థి వ్యూహం!
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం అంటాం. మెజారిటీ అంటే 100 మందిలో కనీసం 51 మంది ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు వారిది మెజారిటీ అభిప్రాయంగా పరిగణిస్తాం. కానీ భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో గెలుపొందాలంటే అభ్యర్థి మిగతా అందరి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే చాలు. ఈ క్రమంలో 50 శాతం ఓట్లు కూడా అవసరం లేదు. పోటీలో ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు గెలుపొందే వ్యక్తికి 50 శాతాన్ని మించి ఓట్లు వస్తాయి తప్ప ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు 40 శాతం కంటే తక్కువ ఓట్లతో కూడా సునాయాసంగా గెలుపొందవచ్చు. అంటే మిగతా 60 శాతాన్ని మించిన ఓటర్లు ఆ అభ్యర్థిని కోరుకోకపోయినా సరే.. ఆ అభ్యర్థి గెలుపొందవచ్చు. ఇందుక్కారణం.. ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నవారంతా ఒకవైపు లేకపోవడమే. సరిగ్గా ఇదే పాయింట్‌ను అస్త్రంగా మలచుకోవాలని విపక్ష కూటమి భావిస్తోంది. బలీయమైన శక్తిగా ఎదిగి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీకి బ్రేకులు వేయాలంటే.. బీజేపీని వ్యతిరేకించే ఓట్లన్నింటినీ ఒకచోటకు చేర్చాలని చూస్తోంది. అందులో భాగంగానే విపక్షాలన్నీ కలసికట్టుగా 400కు పైగా స్థానాల్లో బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలకు నిలయమైన విపక్ష కూటమిలో అగ్రనేతల మధ్య సయోధ్య సాధ్యపడినా క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అందుకే ఎన్నికల్లో గణితశాస్త్ర సూత్రాలు వర్తించవని, 1+1=2 అవుతుందన్న గ్యారంటీ ఏమీ ఉండదని చెబుతుంటారు. ఈ విషయం పక్కనపెట్టి.. ఒకవేళ అర్థగణాంకాలు ఫలిస్తాయనే అనుకుందాం.

Also Read : సమాచారం అడగడం మన హక్కు

ఇదే సమయంలో గత పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను, ప్రజల్లో పెంచుకుంటున్న ఆదరణను కూడా ఓసారి పరిశీలిద్దాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 545 స్థానాలున్న లోక్‌సభకు బీజేపీ సొంతంగానే 282 స్థానాల్లో గెలుపొంది, మిత్రపక్షాల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యాబలాన్ని సాధించింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఈ సంఖ్యను మరింత పెంచుకుని సొంతంగానే 303 సీట్లు సాధించింది. దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ఓట్లు సగటున 37.36% కాబట్టి.. ఆ పార్టీ గెలిచిన చోట అభ్యర్థులకు అటూ ఇటూగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వచ్చి ఉంటాయని, మిగతా పార్టీలన్నీ కలసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించితే బీజేపీని తుడిచిపెట్టేయవచ్చని అనుకుంటాం. ఇదే నిజమైతే బీజేపీ ఈసారి గెలుపొందడం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. మొత్తం 545 స్థానాల లోక్‌సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాలకు బీజేపీ పోటీ చేసింది 436 స్థానాల్లోనే. వాటిలో 303 గెలుపొందడం అంటే పోటీచేసిన స్థానాల్లో 70 శాతం గెలుపొందడం. ఇదొక లెక్కయితే.. గెలుపొందిన 303లో 224 సీట్లను ఏకంగా 50 శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందింది. అంటే 2019లోనే విపక్షాలన్నీ కలసికట్టుగా పోటీ చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించి, క్షేత్రస్థాయిలో కూడా తమ ఓట్లన్నింటీనీ ఉమ్మడి అభ్యర్థికి బదిలీ చేసినపక్షంలో బీజేపీని 224 సీట్లకు పరిమితం చేయగలిగేవి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కనీస సంఖ్య 272కు 48 సీట్ల దూరంలో నిలపగలిగేది. అంటే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిని కల్పించగలిగేది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube