‘ప్రిన్స్‌’ మూవీ రివ్యూ

‘ప్రిన్స్‌’ మూవీ రివ్యూ

1
TMedia (Telugu News) :

‘ప్రిన్స్‌’ మూవీ రివ్యూ

 

టీ మీడియా, అక్టోబర్ 21, సినిమా

నటీనటులు : శివ కార్తికేయన్‌, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్‌, ప్రేమ్‌గీ అమరన్‌, సతీష్‌ కృష్ణన్‌, ఆనంద్‌ రాజ్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు : ఎడిటర్‌ – ప్రవీణ్‌ కేఎల్‌, సినిమాటోగ్రఫీ – మనోజ్‌ పరమహంస, సంగీతం -ఎస్‌ థమన్‌, నిర్మాతలు – సునీల్‌ నారంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌ రావు, డి. సురేష్‌ బాబు, రచన, దర్శకత్వం – అనుదీప్‌ కేవి

 

‘జాతిరత్నాలు’ చిత్రంతో డైలాగ్‌ ప్రధానంగా సాగే కామెడీలో ఒక కొత్త తరహాను తీసుకొచ్చారు దర్శకుడు అనుదీప్‌ కేవి. లోకజ్ఞానం ఏమాత్రం లేని అమాయక పాత్రలతో హాస్యాన్ని పండించారు. ఈ దర్శకుడు శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందించిన ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్‌’. బ్రిటీష్‌ అమ్మాయిని ప్రేమించిన భారతీయ యువకుడు సమాజం నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ప్రిన్స్‌’ ప్రేక్షకులను నవ్వించాడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:
పాండిచ్చేరిలో స్కూల్‌ టీచర్‌ ఆనంద్‌ (శివ కార్తికేయన్‌). అతని తండ్రి విశ్వనాథం (సత్యరాజ్‌) ఊర్లో పేరున్న వ్యక్తి. అమాయకుడైన విశ్వనాథంకు అంతే అమాయకుడైన కొడుకు ఆనంద్‌. పిల్లలకు పాఠాలు చెప్పకుండా రోజుకో సినిమాకు వెళ్తుంటాడు. ఆనంద్‌ స్కూల్‌లో కొత్త టీచర్‌గా చేరుతుంది జెస్సీక (మరియా ర్యాబోషప్క). ఆమెది బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి. తండ్రి విలియమ్స్‌ రెస్టారెంట్‌ బిజినెస్‌లో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. జెస్సీకని తొలిచూపులోనే ప్రేమిస్తాడు ఆనంద్‌. జెస్సీక ఒక ఇండియన్‌ను ప్రేమించడం ఆమె తండ్రి విలియమ్స్‌కు ఇష్టం ఉండదు. పాండిచ్చేరిలోని విలియమ్స్‌ భూమిని ఒకడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. దాంతో భారతీయులు చెడ్డ వాళ్లనే భావనలో ఉండిపోతాడు విలియమ్స్‌. ఆనంద్‌ తండ్రి విశ్వనాథం కులం, మతం పట్టింపులేని వ్యక్తి. అయితే బ్రిటీషర్లతో పోరాడి తన తాత చనిపోయిన కారణంగా అతనికి బ్రిటీషర్లంటే పడదు. విలియమ్స్‌ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఆనంద్‌, అతని కుటుంబం భారత్‌కు వ్యతిరేకంగా బ్రిటీష్‌ వారికి మద్దతుగా మాట్లాడుతున్నారని ఊర్లో అందరికీ చెప్తాడు. అతని మాటలు నమ్మిన ఊరి జనం ఆనంద్‌ను ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆనంద్‌ తను ప్రేమించిన అమ్మాయి జెస్సికను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగిలిన కథ.

Also Read : సినిమా అంటే ఇది.. కాంతారపై నటి కంగన ప్రశంసలు

ఫ్లస్‌ పాయింట్స్‌:
నవ్వించే డైలాగ్స్‌
శివ కార్తికేయన్‌, సత్యరాజ్‌ పాత్రలు
దర్శకత్వ ప్రతిభ

మైనస్‌ పాయింట్స్‌:
సినిమా టేకాఫ్‌
తమిళ ఛాయలు
సంగీతం

ఎలా ఉందంటే:
‘జాతిరత్నాలు’ చిత్రంలో అమాయకమైన పాత్రల ద్వారా కామెడీని సృష్టించి కొత్త ఒరవడి తీసుకొచ్చాడు దర్శకుడు అనుదీప్‌. తనకు కలిసొచ్చిన ఆ ఫార్మేట్‌ను ఈ చిత్రంలోనూ కొనసాగించాడు. జాతిరత్నాల్లాగానే ఈ సినిమాలోనూ పాత్రలు ప్రవర్తిస్తాయి. ప్రతి సీన్‌లోనూ ఇన్‌స్టంట్‌ కామెడీ పంచ్‌లుంటాయి. ఇవే సినిమాను బతికించాయని చెప్పుకోవచ్చు. స్కూల్‌ వదిలేసి థియేటర్‌కు వెళ్లే టీచర్‌ ఆనంద్‌ ప్రవర్తన, జెస్సిక కొత్తగా జాయిన్‌ అవడం, ఆమె ప్రేమ కోసం ఆనంద్‌ చేసే పనులన్నీ నవ్విస్తాయి. సత్యరాజ్‌ చేసిన విశ్వనాథం క్యారెక్టర్‌ ఆద్యంతం నవ్విస్తుంది. ఆనంద్‌ పాత్రలో శివ కార్తికేయన్‌ మెప్పించాడు. అతని నటన, కామెడీ టైమింగ్‌, హావభావాలు ఆకట్టుకున్నాయి. మరియా ర్యాబోషప్క అభినయంతో పాటు పాటల్లో చేసిన మన నేటివిటీ డాన్సులు ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర నటీనటులు పాత్రోచితంగా కనిపించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ సినిమాకు కలిసొచ్చాయి. థమన్‌ సంగీతం ప్రధాన లోపం. అతని ప్రతిభకు లోటు లేకున్నా, ఈ సినిమాకు మాత్రం న్యాయం చేయలేకపోయాడు. పాటలు, నేపథ్య సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదు. లండన్‌, పాండిచ్చేరి నేపథ్యంగా సాగే చిత్రమని చెప్పినా, మొత్తం మన దగ్గరే షూటింగ్‌ చేశారు. లండన్‌లో చేసిన చిత్రీకరణ అతి స్వల్పం. ప్రధాన పాత్రలకు తమిళ నటులను తీసుకోవడం వల్ల ఇది తెలుగులో డబ్బింగ్‌ అయిన తమిళ చిత్రమేమో అనిపిస్తుంది. మన దర్శకుడు అనేది తప్ప ఇంకే రిలేటివిటీ లేదు. ఊరి పేర్లు, పాత్రల పేర్లు మాత్రం తెలుగులో తలిగించారు. కామెడీ చిత్రాలకు సినిమాలో మూడొంతుల హాస్యాన్ని నింపి, చివరగా ఒక భాగం ఏదో ఒక మంచి విషయాన్ని, ఒక చిన్న సందేశాన్నీ ఇస్తారు. ఇందులోనూ ఆ పతాక సన్నివేశాలనూ కామెడీగా మార్చేశారు. అయినా అక్కడక్కడ మనకు దేశం, ప్రాంతం కాదు మనవత్వం ముఖ్యమని చెప్పారు. ఇన్‌స్టంట్‌ పంచ్‌లతో కాసేపు కామెడీని ఆస్వాదించేందుకు ఈ సినిమా ఒక ఆప్షన్‌ అనుకోవచ్చు.

చివరగా : ఇది మరో జాతిరత్నం

రేటింగ్‌ : 2.75/5.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube