సేవకులకు నా సెల్యూట్
అన్ని శాఖల వారికి ఎంపీ నామ అభినందనలు
ముంపు గ్రామాల్లో సాధారణ పరిస్థితులకు చర్యలు
పారిశుధ్యం, విద్యుత్ పునరుద్ధరణకు కార్యాచరణ
అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు
-ఎంపీ నామ నాగేశ్వరరావు
టి మీడియా ,జూలై17,ఖమ్మం: గోదారి వరద సహాయ కార్యక్రమాల్లో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు సేవలకు సెల్యూట్ చేస్తున్నానని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. విపత్తు సమయంలో ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగామని చెప్పారు. ఈమేరకు శనివారం నామ క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అంతా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, వరద బాధిత ప్రాంతాల్లో సేవలందించడం ఎంతో అభినందనీయమన్నారు. వరద క్రమేపీ తగ్గు ముఖం పడుతున్నందున బాధిత ప్రాంతాల్లో ప్రజలు మళ్ళీ యధావిధి జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన పూర్తి కార్యాచరణను సంపూర్ణంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించిందన్నారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారని చెప్పారు. జ్వర పీడిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ, మందులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వచ్చే లోగా వరద ప్రభావిత గ్రామాలను పరిశుభ్రం చేస్తారని అన్నారు.
Also Read : అన్నం శ్రీనివాసరావు ను సన్మానించి న ఆర్.జే.సి. కృష్ణ
ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, సింగరేణి, విద్యుత్ తదితర ప్రభుత్వ శాఖలు అందించిన సేవలు ఆమోఘమైనవన్నారు. భవిష్యత్ లో భద్రాచలం కరకట్ట పటిష్టతకు కూడా ప్రభుత్వం మరెన్ని రక్షణ చర్యలు తీసుకుంటుందని నామ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకించి ఫోకస్ పెట్టి, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేయడం వల్ల విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని నామ పేర్కొన్నారు. 36 ఏళ్ల తర్వాత అనుకోని విధంగా వరద విపత్తు సంభవించిందని, పెద్ద ప్రమాదం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా భద్రాద్రి ఏజెన్సీ ప్రజలు బయట పడ్డారని చెప్పారు. ఈ విపత్తును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్లో ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని నామ చెప్పారు. ఏది ఏమైనా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఈ విపత్తులో ప్రాణ నష్టం వాటిల్లకుండా శక్తి వంచనలేకుండా శ్రమించారని, వారికి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నట్లు ఎంపీ నామ పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube