ప్రశాంతంగా ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ఓటింగ్

ప్రశాంతంగా ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ఓటింగ్

1
TMedia (Telugu News) :

ప్రశాంతంగా ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ఓటింగ్

టీ మీడియా,నవంబర్ 4,మునుగోడు : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఓటేసేందుకు ఉత్సాహంచూపారు. వికలాంగులు, జబ్బున పడినవారుసైతం తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు గంటలకొద్దీ నిరీక్షించి మరీ.. తమ ఎమ్మెల్యే ఎవరో తేల్చేందుకు ఆసక్తి చూపారు. 47 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చే తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏ ఇబ్బంది తలెత్తకుండా యంత్రాంగం నిత్యం పర్యవేక్షించింది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారి కోసం… ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా ప్రతీ కేంద్రంలో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా సిబ్బంది సకాలంలో స్పందించి సరిచేశారు .

Also Read : రోడ్డు వెడల్పులో చిత్ర విచిత్రాలు

చండూరు మండలం కొండాపురంలో ఈవీఎంలో అంతరాయం తలెత్తగా.. 178వ పోలింగ్‌ కేంద్రంలో అరగంటపాటు ఓటర్లు వేచిచూశారు. చిన్నకొండూరులో వీవీ ప్యాట్‌, “ఎస్.లింగోటం”లో ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తగా సరిదిద్దారు. చౌటుప్పల్‌ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్…పోలింగ్‌ సరళి, అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఉపఎన్నిక ప్రచారంలో తలెత్తిన ఘర్షణల దృష్ట్యా నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ… క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలో పరిస్థితులను సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. మునుగోడు, పలివెల, నాంపల్లి కేంద్రాలను పర్యవేక్షించిన నల్గొండ రెమా రాజేశ్వరి… ఓటర్లతో మాట్లాడుతూ…పోలింగ్‌ జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు.

Also Read : అదుపుతప్పిన బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

ఉపఎన్నిక పోలింగ్‌వేళ పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మర్రిగూడ మండలంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులున్నారంటూ… భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన స్థానికేతరులున్నారంటూ కొందరిని బయటకు లాక్కురావటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లి చండూరు మున్సిపాల్టీ పరిధిలో వాహనాల్లో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి వద్దకు తరలించిన అధికారులు అక్కడ మూడంచెల భద్రత కల్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube