ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం

ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం

1
TMedia (Telugu News) :

ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం

టీ మీడియా,నవంబర్ 16,జగిత్యాల బ్యూరో : తమ ఇష్టాన్ని కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు. ఆమె మనస్సు ముక్కలయ్యేలా ప్రవర్తించారు. అత్తవారింటి నుంచి కూతురిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లడమే కాకుండా.. ఆపై పైశాచికంగా ప్రవర్తించి కూతురికి శిరోముండనం చేశారు. ఆమె మనసును మార్చేందుకు శతవిథాలా ప్రయత్నించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు వదిలి పెట్టారు. అత్తింటి వారి ఇంటి నుంచి యువతిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి శిరోమండనం చేసిన వైనం జగిత్యాల జిల్లాలోని ఇటిక్యాలలో వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కట్టుకున్నోడు కావాలంటూ యువతి స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు.

Also Read : భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

దీంతో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్షిత తన అత్తవారి ఇంట్లో ఉంటుండగా.. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబసభ్యులు మధు కుటుంబంపై దాడిచేశారు. అక్షితను బలవంతంగా అపహరించారు. కారులో తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొడుతూ హింసించారు. అక్షిత గట్టిగా కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. ఆ తర్వాత రోజు యువతి జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు తెలపడంతో.. ఎస్సై అనిల్‌ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని భర్తకు అప్పగించామని తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు న్యాయం చేస్తామని యువతికి హామీ ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube