ఆగస్టులో జాతీయ దళిత బంధు సమ్మేళనం
టీ మీడియా, జనవరి 31, కరీంనగర్ : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఆగస్టు 16 నాటికి ఈ పథకం అమలు చేసి రెండేండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజున కరీంనగర్ జిల్లాలో జాతీయ దళిత బంధు సమ్మేళనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. కరీంనగర్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్( సర్క్యూట్ రెస్ట్ హౌస్), ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు కేటీఆర్ కీలక సూచనలు చేశారు. ఆగస్టు 16, 2023 జాతీయ దళిత బంధు సమ్మేళనం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ మేళాకు జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలను, మేధావులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని సూచన చేశారు. దళితుల కోసం అమలు చేస్తున్న దళిత బంధు గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు.
Also Read : ఈ తప్పులు చేయకండి.. శని దేవుడి ఆగ్రహానికి గురవుతారు..
దళితుల ఆర్థిక ప్రగతికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో పాటు దేశానికి వివరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో దేవయ్య అనే దళితుడు దళిత బంధు కింద లబ్ధిపొంది ఆర్థికంగా ఎదుగుతున్నాడని కేటీఆర్ తెలిపారు. దేవయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ను కేటీఆర్ అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube