నవభారత నిర్మాణంలో ‘మార్పునకు సారథులు’గా సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి
ప్రభుత్వ పథకాల సరైన అమలుతోనే సమాజశ్రేయస్సు సాధ్యం
- సర్దార్ పటేల్ కలలుగన్న వివక్షలేని సమాజాభివృద్ధికి కృషిచేయండి
- లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ ముగింపు సమావేశంలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
ఆగస్టు 7, 2020, న్యూఢిల్లీ
నవభారత నిర్మాణంలో ‘మార్పునకు సారథులు’ (ఛేంజ్ ఏజెంట్స్) గా సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అధికారులు తమ వృత్తిని మిషన్‌గా స్వీకరించాలని ఆయన సూచించారు. శుక్రవారం.. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ రెండోదశ శిక్షణ ముగింపు సమావేశంలో భావి సివిల్ సర్వీసెస్ అధికారులనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
‘నవభారత నిర్మాణంలో మార్పునకు సారథులుగా మీ పాత్రను పోషించండి. సుపరిపాలన ద్వారానే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసినపుడే ఆ పథకాలకు సార్థకత కలుగుతుంది. ఈ దిశగా సివిల్ సర్వీసెస్ అధికారులుగా మీ పాత్ర అత్యంత కీలకం’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.
‘పరిపాలన, ఆర్థిక, న్యాయ, రాజనీతి శాస్త్రాలతోపాటు రాజ్యాంగం, చరిత్ర, సంస్కృతి, భాషలు తదితర అంశాలపై మీరు రెండేళ్లుగా శిక్షణ పొందారు. మీరు నేర్చుకున్న అంశాలను చక్కగా అవగతం చేసుకుని ప్రజాశ్రేయస్సుకు పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను. నిజాయితీ, క్రమశిక్షణతో, సమయపాలన పాటిస్తూ.. బాధ్యతాయుతంగా పనిచేయండి. పారదర్శక పాలనతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కండి. పేద-ధనిక, స్త్రీ-పురుష, గ్రామీణ-పట్టణ అంతరాలను తొలగించేలా చొరవతీసుకొండి’ అని వారికి సూచించారు.
శిక్షణ పూర్తిచేసుకున్న ఈ అధికారులు.. తమ అధికార పరిధిలోని ప్రాంతంలో పరిపాలన స్థానికభాషలో జరిగేలా చొరవతీసుకోవాలని సూచించారు. దీంతోపాటు స్థానిక సంస్కృతులు, సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే అక్కడి.. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.
భారత ప్రథమ ఉపప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుకన్నట్లుగా.. పేదరికం, వివక్షలేని సమాజం నిర్మాణం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సివిల్ సర్వీసెస్ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు.
ఈ సందర్భంగా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ తీసుకొచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమ ప్రసంగాల సంకలనం ’65 కన్వర్జేషన్స్’ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ శ్రీ సంజీవ్ చోప్రా, అధ్యాపకులు, శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులు పాల్గొన్నారు.