వంట నూనెల ధరలకు ప్రభుత్వం కళ్లెం
-రంగంలోకి ఆయిల్ ఫెడ్
-రైతు బజార్లలో ‘విజయ’ విక్రయాల
టి మీడియా, మార్చి 14 , అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది.కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే.
Also Read : 2,850కి పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు: మంత్రి హరీశ్‌రావు
అది మరింత ‘ప్రియ’
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.170-175, పామాయిల్ రూ.158-160, వేరుశనగ నూనె రూ.170-173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170- 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి.