అనంతం.. పద్మనాభ అనుగ్రహం!

అనంతం.. పద్మనాభ అనుగ్రహం!

2
TMedia (Telugu News) :

అనంతం.. పద్మనాభ అనుగ్రహం!
టీ మీడియా, ఆధ్యాత్మికం బ్యూరో :

పన్నగశాయి పరమాద్భుత రూపం అనంత పద్మనాభ స్వరూపం. సృష్టి, స్థితి, లయ తత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళ రూపం ఎంత సేపు చూసినా తనివి తీరదు. కావేరి తీరంలో పద్మనాభుడిగా, తెలుగునాట రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామి. ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది ‘అనంత పద్మనాభ వ్రతం’. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అద్భుతమైన వ్రతం ఇది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి సాధనం. భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులు.. శ్రీకృష్ణుని సలహా మేరకు అనంత పద్మనాభ వ్రతాన్ని చేశారని పురాణ కథనం. ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విజయాలకు అనంత వ్రతం ఉత్తమ సాధనంగా చెబుతారు.

Also Read : గంగమ్మ ఒడికి చేర్చాల్సిందే

పద్మనాభుడి అర్చనలో మహావిష్ణువు పానుపు అయిన అనంతుడిని ఆరాధించడం ఇందులోని ప్రత్యేకత. వ్రతం విధివిధానాలు భవిష్యోత్తర పురాణంలో వివరించారు. పిండితోగానీ, దర్భలతోగానీ ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి అష్టదళ పద్మమంటంపై గానీ, కలశంపై అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశ ఉపచార పూజలు నిర్వర్తిస్తారు. కలశంలో పవిత్ర జలాలలో యమునా నదిని ఆవాహన చేసి వ్రతం కొనసాగిస్తారు. అందులోనే కొద్దిగా పాలు, వక్క, వెండినాణెం వేస్తారు. పూజలో భాగంగా 14 ముడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచుతారు. తోరాలలోని 14 ముడులు ఒక్కో దేవతకు సంకేతంగా చెబుతారు. దిక్పాలకులు, రవి, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యముడు, బ్రహ్మ, చంద్రుడు, జీవుడు, శివుడు, వాయువు, అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ ముడుల ద్వారా తెలియజేస్తారు. వ్రత పరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరిస్తారు. ఈ వ్రతాన్ని పాలీ చతుర్దశి వ్రతం అనీ, కదలీ వ్రతం అనీ పిలుస్తారు. ఒకసారి వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని చెబుతారు పెద్దలు. పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంత వ్రతానికి మరింత శ్రేష్ఠమని భావిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube