ఫోటోగ్రాఫర్‌

ఓపిక, సహనం, పట్టుదల ఎక్కువ

0
TMedia (Telugu News) :

ఫోటోగ్రాఫర్‌

-ఓపిక, సహనం, పట్టుదల ఎక్కువ

– నైపుణ్యాన్ని కలగలిపి ఎన్నెన్నో కోణాల్లో ఫోటోలు

లహరి, మార్చి2, కల్చరల్ : ఇది పెళ్లిళ్ల సీజన్‌, రిసెప్షన్ల సీజన్‌. ఈ సీజనంతా పెళ్లి చుట్టూ ఉండే అవసరాలతో ఎందరికో జీవనోపాధి. వాళ్లలో ఫోటోగ్రాఫర్‌ ఒకరు. ఎంతో ఓపిక, సహనం, పట్టుదల ఉంటే కానీ ఈ రంగంలో ఉండడం కష్టం. కష్టమైనా సరే, వాళ్లు ఎంతో కొంత టేస్ట్‌ ఉండబట్టి అలా ఫోటోగ్రాఫర్లుగా నిలబడగల్గుతారు. ఇక పెళ్లిలో వీళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. కొందరైతే తమ ప్రతాపాన్ని, నైపుణ్యాన్ని కలగలిపి ఎన్నెన్నో కోణాల్లో ఫోటోలు తీస్తారు. పైత్యాన్ని కూడా కలుపుతారని మా మిత్రుడంటూ ఉంటాడు. తాళి మళ్లీ కట్టమన్నా, దండ మళ్లీ వేయమన్నా, తలంబ్రాలు తిరిగి వేయమన్నా చేయాల్సిందే. అది ఫోటోగ్రాఫర్‌ పవరంటే. ఎందరో పురోహితులు ఈ ఫోటోగ్రాఫర్లు తమ పనికి అడ్డు తగులుతున్నారని అంటూ ఉంటారు. వీళ్లు వింటూ ఉంటారు కానీ తాము చేసేది చేస్తూనే ఉంటారు. తలంబ్రాలు వేస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల మధ్యలో దూరిపోయి పెళ్లికొడుకు తలంబ్రాల చేతుల కిందినుంచి ఫోటో తీస్తున్న ఒక ఫోటోను వాట్సప్పులో పెట్టారు మిత్రులు. అది నిజమైనా కాకున్నా వాళ్లు పడే కష్టమంతా పెళ్లివాళ్ల కోసమే కదా.విత్‌ ద ఫోటోగ్రాఫర్‌ అని రచయిత స్టీఫెన్‌ లీకాక్‌ ఒక చిన్న కథ రాస్తాడు. నలుపు తెలుపు ఫోటోలున్న కాలంలో ఫోటో తీసుకుందామని స్టూడియోకు పోతాడు రచయిత. ఈయన మొహం చూస్తేనే ముభావంగా చూస్తాడు ఫోటోగ్రాఫర్‌. అంటే నీ మొహం ఫోటోకు పనికి రాదు అన్నట్టు. ఎలాగో తీయించుకొని బయటపడతాడు. చెప్పిన రోజుకు ఫోటో తీసుకుందామని పోతే ఒక ఫోటో చేతిలో పెడతాడు. ఆ ఫోటోలో కనిపించే తల, కళ్లు, ముక్కు, చెవులు తనవి కాదు, ఏమంటే అవి బాగా లేవని మార్చానంటాడు, టచప్‌లు ఇచ్చానంటాడు. ఇది నా చిత్రం కాదు, నీదగ్గరే ఉంచుకో అని బాధగా వెళ్లిపోతాడు రచయిత. ఆ కథలో ఎంతో వ్యంగ్యం ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు ఇలా కూడా ఉండేవారన్నమాట. ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందానికి ఇలాంటి సీను పెట్టారు కూడా. ఇప్పుడు కూడా హెచ్‌.డి అని, బ్యూటిఫై అని ఎవరినైనా సినిమా హీరోల్లా చూపేవాళ్లూ ఉన్నారు. సెల్లుల్లో అలా చేసేవాళ్లూ ఉన్నారు.

Also Read : వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటా తినాల్సిందే..

పెళ్లిలో ఫోటోలు, వీడియో తీస్తుంటారు కాబట్టి జనాలు ఓ క్రమశిక్షణతో కూర్చొని ఉంటారు. కొద్దిగా నవ్వు మొహం కూడా పెడుతుంటారు. సడన్‌గా డ్రోన్‌ కెమేరా పైనుండి పోతుంటుంది హెలికాప్టరు లాగా. అంతకు ముందు క్రేన్‌ లాటి యంత్రాలతో తీసేవారు. ఇలా టెక్నాలజీ కొత్త కొత్త రూపాలు ధరించినప్పుడంతా ఈ ఫోటోలు కూడా అతీతం కాదు కాబట్టి అవీ వాటిని ఉపయోగించుకుంటాయి. ఫోటొగ్రాఫర్లు లేదా ఆపరేటర్లు ఉంటేనే ఈ వీడియోలు, ఫోటోలు వస్తాయా అంటే లేదు అని సమాధానమొస్తుంది. సీసీ కెమేరాలు వాటంతట అవే ఇరవైనాలుగు ఇంటూ ఏడు అన్నట్టు పనిచేస్తుంటాయి. చివరికి క్రికెట్‌ మ్యాచుల్లో కూడా మూడో అంపైర్‌ రూపంలో వీడియో చూసి మరీ బల్లేబాజ్‌ అవుటా కాదా అని నిర్ణయిస్తారు. ఇక గూగుల్లో కూడా కత్రిమ ఉపగ్ర హాలు పంపే చిత్రాల ద్వారా మనం చూడొచ్చు. సినిమా షఉటింగులు తీసే ఫోటోగ్రాఫర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నిచోట్లా ఉన్నట్టుగానే అక్కడా శ్రమదోపిడీ ఉంటుంది. ఏ అవార్డో వచ్చినప్పుడు మాత్రం ఆకాశానికెత్తేస్తారు. ముందే అనుకు న్నట్టు ఈ ఫోటోలు, వీడియోలు ఓ నిఘాగా మనం అర్థం చేసుకోవాలి. సమాజాన్ని చిత్రించే కవులు, కళాకారులు తమ కలాలతో, తమ కళారూపాలతో దేశంలో, రాజకీయాల్లో ఏమి జరుగుతోందని ఆరా తీస్తూ వాటిని ప్రజలకు చూపిస్తుంటారు. ఒక విధంగా వాళుల జరుగుతున్న దాన్ని చూపే ఫోటోగ్రాఫర్లే అనుకోవాలి. మూడో అంపైర్‌ వీడియో క్లిప్పింగులు చూసి నిర్ణయం ప్రకటించినట్టు మొత్తం చూసి మరీ అవుట్‌ చెబుతారు.

Also Read : “ఢిల్లీ” లో గల్లియవ్వారం

అప్పుడు కానీ నిత్యం గమనించే ఫోటోగ్రాఫర్లు ఉన్నారని తెలియదు కొందరు జనాలకు. కానీ ప్రభుత్వాలు, నాయకులు మాత్రం స్టీఫెన్‌ లీకాక్‌ కథలో మాదిరిగా ఉన్నది లేనట్టు చూపితేనే సహిస్తారు, హర్షిస్తారు. అలాంటివారినే పోషిస్తారు. ప్రోత్సహిస్తారు. పైన చెప్పుకున్న ఓపిక, సహనం, పట్టుదల ఎక్కువగా ఉండబట్టి వాళ్లు ప్రజల వైపే నిలబడతారు. కొద్దిమందైనా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా నిలబడి ప్రజల గొంతును తమగొంతుగా వినిపిస్తారు. ప్రజలవైపు నిలబడే పత్రికల్లో రాస్తారు, ఏ టీవీయైనా ప్రజల గొంతుతోనే మాట్లాడతారు, ప్రజలకూ, నిజాలకు భయపడేవాళ్ళు ఎన్ని ట్రోలింగులు చేసినా విసుగు చెందక, సహనం కోల్పోక తాము చెప్పేది నిజం కాబట్టి తగ్గేదే లేదని మరీ దూసుకుపోతారు. వీళ్లంతా ప్రజలకు చెందిన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లూ కాక మరేమిటి చెప్పండి!!

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube