అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
టి మీడియా, జులై12,దిల్లీ: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ భవనంపై ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. పూర్తిగా కాంస్యంతో చేసిన ఈ చిహ్నం బరువు 9,500 కేజీలు అని అధికారులు వెల్లడించారు. 6.5 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మించారు.నూతన పార్లమెంట్ భవనం మధ్యభాగంలోని పైకప్పుపై ఈ భారీ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ చిహ్నం బరువును మోయగలిగేలా స్తూపం కింద 6,500 కేజీల స్టీల్ కట్టడాన్ని కూడా నిర్మించారు. ఈ జాతీయ చిహ్నానికి ప్రధాని మోదీ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తోన్న కార్మికులతో మోదీ కాసేపు ముచ్చటించారు.
Also Read : జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య
రాబోయే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మిస్తోన్న ఈ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ 2020 డిసెంబరులో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయ పక్షి) ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది.మొత్తం 13 ఎకరాల్లో నిర్మితమవుతోన్న ఈ భవనం అక్టోబరు నాటికి పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ ప్రాజెక్టును ప్రభుత్వం టాటా కంపెనీకి అప్పగించింది. తొలుత రూ.970కోట్ల వ్యయంతో నిర్మించాలని బడ్జెట్లో అంచనా వేసినా.. ఆ తర్వాత నిర్మాణానికి మొత్తం రూ.1250కోట్ల ఖర్చుకానున్నట్లు తెలిసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube