పోలీసులకు హోంమంత్రి సుచరిత హెచ్చరిక*

పోలీసులకు హోంమంత్రి సుచరిత హెచ్చరిక

ఫ్రెండ్లీ పోలీసింగే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి

అమరావతి,: దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోమని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితుడిని కాలితో తన్నిన సీఐని సస్పెండ్‌ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజాం మండలం చీరాల ఘటనకు కారకులైన అధికారులను కూడా సస్పెండ్‌ చేశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తమ ప్రభుత్వ ధ్యేయమని, ఏదైనా ఘటన జరిగితే ఇంత వేగంగా చర్యలు తీసుకున్న సందర్భాలు గతంలో ఎన్నడూ లేవన్నారు.

రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా 18 పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో వరకట్న వేధింపులు, మహిళలపై నేరాలు తగ్గాయని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలించడంలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ముందుగా విశాఖపట్నం జిల్లాలోని తమ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు.