ప్రధాని, అదానీ మాత్రమే ఈ దేశానికి ప్రతినిధులా..?
– మంత్రి కేటీఆర్
టీ మీడియా, ఫిబ్రవరి 4, హైదరాబాద్ : కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న తమ నిబద్ధతను ఎవరూ దెబ్బతీయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రగతి రథచక్రాలను ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుండ బద్దలు కొడుతున్నా. కేంద్ర సర్కారుకు కార్పొరేట్ ముఖ్యమేమో. కానీ, మాకు మాత్రం కామన్ మ్యానే ముఖ్యం. సామాన్య ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ సంకల్పం. అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఏకైక లక్ష్యం. దేశంలో కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. తెలంగాణ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి స్ఫూర్తినిస్తోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
Also Read : మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన గిరిజన మహిళలు
కేంద్రం నుంచి మొదలుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ పథకాలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇవాళ దేశం చూపు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉంది అని అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube