ధరణిపోతే దళారీ దందా.. కాంగ్రెస్ ను నమ్మితే అధోగతే..

ధరణిపోతే దళారీ దందా.. కాంగ్రెస్ ను నమ్మితే అధోగతే..

0
TMedia (Telugu News) :

ధరణిపోతే దళారీ దందా.. కాంగ్రెస్ ను నమ్మితే అధోగతే..

– మంత్రి కేటీఆర్

టీ మీడియా, నవంబర్ 18, కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు.. అదే జరిగితే లంచగొండులు పైరవికారుల దందా మొదలవుతుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల్లో రోడ్డుషోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 పేజీలతో 420 అబద్దాల మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని ఎద్దేవ చేశారు. ధరణి రద్దు చేస్తే రైతులకు రైతు బీమా పంటల పెట్టుబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క‌రికీ సన్న బియ్యం ఇస్తామన్నారు.

Also Read : మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దు

ఢిల్లీ దొరలు కావాలో గల్లీ లీడర్ కావాలో మీరే తేల్చుకోవాలని తెలిపారు. కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కావలసిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలను నమ్మి ఓట్లు వేసి మోసపోవద్దని సూచించారు. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అన్నివర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. మూడవసారి అధికారంలోకి రాగానే ఆ సంక్షేమ పథకాలను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ తో పింఛన్లు ఎన్ని ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారని తెలిపారు.

Also Read : 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించారు

ఆయనను భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలలో కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. భారతదేశంలోని 26 రాష్ట్రాల్లో లేని పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎంపీపీ గాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube