హిమాచల్ సీఎం ఎవరో తేల్చేది ప్రియాంకాగాంధీయే..!
టి మీడియా, డిసెంబర్ 10,షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని తేల్చబోయేది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీయేనని ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. హిల్స్టేట్లో చాలామంది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందున వారిలో ఒకరి పేరును ఖరారు చేయడం అనేది కత్తిమీద సాము చేయడం లాంటిదే. ఎవరి వైపు మొగ్గితే ఎవరు తన వర్గీయులతో కలిసి బీజేపీ పంచన చేరి పార్టీని దెబ్బకొడతారోననే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్తగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిమ్లాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ కేంద్ర పరిశీలకులు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేశ్ బఘేల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఎవరికి ఎక్కువ మంది మద్దతు ఉన్నదని వారు ప్రతి ఎమ్మెల్యేను ఆరా తీశారు. ఆఖరికి నూతన సీఎం పేరును ఖరారు చేసే బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తున్నట్లు తీర్మానం చేసి పంపించారు. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రచార బాధ్యతలు తన భుజాలపై వేసుకుని ముందు నడిచిన ప్రియాంకాగాంధీకే తాజా గెలుపు క్రెడిట్ దక్కింది. ఈ నేపథ్యంలో నూతన సీఎం పేరును ఖరారుచేసే బాధ్యతను ఆమెకే అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
Also read : మాండూస్ ఎఫెక్ట్..
సిర్మౌర్, కంగ్రా, ఉనా ర్యాలీ సందర్భంగా ప్రియాంకాగాంధీ అగ్నిపథ్, అధిక ధరలు, నిరుద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ అంశాలను ప్రధానంగా లేవనెత్తి హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కాగా, సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ ముందు వరుసలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నూతన ఎమ్మెల్యేల సమావేశానికి ముందు కూడా ప్రతిభాసింగ్ మద్దతుదారులు బలప్రదర్శన చేశారు. ఆమెతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహోత్రి కూడా సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు కూడా తామూ సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube