టీ మీడియా, డిసెంబర్, 22, భద్రాచలం
చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోమని మరోసారి నిరూపించారు జేడీ ఫౌండేషన్ భద్రాచలం వారు, ఈ మేరకు లాక్డౌన్ సమయంలో జేడీ ఫౌండేషన్& ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో యాచకులకు అన్నదానం చేసిన విషయం విదితమే, ఈ అన్నదానానికి రెండు పూటలా భోజనం వండిన తండ్రి లేని ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలోని యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకు వస్తే, మేమున్నాం మీకు అండగా అని పెద్ద మనసు చాటారు ఛాంబర్ లోని వ్యాపారులు. ఈ మేరకు భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య నివాసంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ సమక్షంలో భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ కి చెందిన షేక్ చాందిని అనే యువతి కి 70 వేల రూపాయల నగదు చెక్కు రూపం లో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జెడి పౌండేషన్ ప్లాస్టిక్ నిషేధం తో పాటు అనేక రకాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేవని వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్న చాంబర్ ఆఫ్ కామర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
తానుకూడా షాదీ ముబారక్ ద్వారా వచ్చే మొత్తాన్ని త్వరగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జేడీ పౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ ఈ యువతికి సహాయం కొరకు 30వేల రూపాయలు చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా, మిగిలిన 40 వేలు జేడీ లక్ష్మీనారాయణ, జేడీ ఫౌండేషన్ సభ్యులు మరియు ఎక్స్ట్రా మైల్ వారి సహకారంతో అందించామని అలాగే పెళ్లి కూతురు కి కావలసిన వంట సామగ్రిని వి ఆర్ విత్ యు సంస్థ వారు అందించారని, ఈ యువతి వివాహం కొరకు సహకరించిన దాతలకు, జెడి పౌండేషన్ సభ్యులకు, చాంబర్ ఆఫ్ కామర్స్ కంభంపాటి సురేష్ , ఇతర వ్యాపారస్తులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు హన్సి, అంబికా సురేష్, కడాలి నాగరాజు,గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు భోగాల శ్రీనివాసరెడ్డి, బొలుసు సతీష్,కాంగ్రెస్ నాయకుడు సరేళ్ల నరేష్,సభ్యులు యూసుఫ్ మియా, రాంప్రసాద్ రెడ్డి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.