చీకట్లోకి భారత్‌.. డజను రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం

యూపీ, పంజాబ్‌, ఏపీలో 8 గంటల కోతలు

1
TMedia (Telugu News) :

చీకట్లోకి భారత్‌.. డజను రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం

– డజను రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం

-యూపీ, పంజాబ్‌, ఏపీలో 8 గంటల కోతలు
-థర్మల్‌ ప్లాంట్లలో అడుగంటిన బొగ్గు నిల్వల

టి మీడియా,ఎప్రిల్ 22,ఢిల్లీ:
బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న రాష్ర్టాలు.. యూపీ, పంజాబ్‌, ఏపీ, హర్యానా, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌

దేశంలోని దాదాపు డజను రాష్ర్టాలను చీకట్లు అలుముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, ఏపీలో ఇప్పటికే రోజుకు 8 గంటల చొప్పున విద్యుత్తు కోతలు అమల్లోకి వచ్చాయి. మరో ఎనిమిది రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాక్‌లోని దుస్థితే భారత్‌లోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : కొత్త రెషన్ కార్డులు అసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

దేశంలో ఉత్పత్తి అయ్యే 70 శాతం విద్యుత్తుకు బొగ్గే ఆధారం. థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటిపోతుండటంతో విద్యుత్తు ఉత్పత్తి నెమ్మదించిందని, దీంతో విద్యుత్తు సరఫరా తగ్గినట్టు అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. 150 థర్మల్‌ ప్లాంట్లలో 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి క్లిష్టంగా ఉన్నది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. మొత్తంగా మరో తొమ్మిది రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ప్లాంట్లలో ఉన్నట్టు ఏఐపీఈఎఫ్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం సాధారణంగా థర్మల్‌ ప్లాంట్లు 26 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకొంటాయి. దీన్ని కనిష్టంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం యూపీలోని థర్మల్‌ ప్లాంట్లలో 7 రోజులు, హర్యానాలో 8 రోజులు, రాజస్థాన్‌లోని థర్మల్‌ ప్లాంట్లలో 17 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.

కారణాలేంటి?
వర్షాల కారణంగా గత అక్టోబర్‌లో దేశంలోని ప్రధాన బొగ్గు క్షేత్రాల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో వెలికితీత ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఆనాడే దేశంలోని ప్రధాన థర్మల్‌ ప్లాంట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలను తిప్పికొట్టడంపైనే దృష్టి సారించిన కేంద్రం.. పరిష్కార మార్గాలను వెదుకలేదు. పైగా విదేశాల నుంచి వచ్చే బొగ్గు దిగుమతులను కూడా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 2.5 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే దిగుమతి చేసుకొన్నది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతమే. కాగా, ఈ ఏడాది మార్చి నుంచే 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో వివిధ రాష్ర్టాల్లో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు సరపడా విద్యుత్తును అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు. బొగ్గు నిల్వలు అడుగంటడంతో కొన్ని ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా పలు రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి.

 

Also Read : గుజరాత్‌కు తరలిపోయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరి

వ్యాగన్ల కొరత

బొగ్గు సంక్షోభానికి వ్యాగన్ల కొరత కూడా ఓ కారణమని దూబే పేర్కొన్నారు. ప్లాంట్లకు బొగ్గును రవాణా చేయడానికి 453 రైల్వే రేక్స్‌ అవసరమని, అయితే కొన్ని రోజులవరకూ 379 రేక్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య 412కు చేరినప్పటికీ, అది ఎంత మాత్రం సరిపోదన్నారు.

గంట కూర్చున్నారు.. ఏం చెప్పలేదు!
దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తనున్నదని వారం, పది రోజులుగా నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ, పట్టించుకోని కేంద్రం తీరిగ్గా మంగళవారం ఓ భేటీని నిర్వహించింది. హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్తుమంత్రి ఆర్కేసింగ్‌, బొగ్గుగనుల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. గంటపాటు ఈ భేటీ సాగినప్పటికీ.. విద్యుత్తు సంక్షోభ నివారణకు చేపట్టనున్న చర్యలపై కేంద్రం ఏ ప్రకటనా చేయకపోవడం గమనార్హం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube