భువనేశ్వర్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి జగన్నాథుడి దర్శనం

1
TMedia (Telugu News) :

భువనేశ్వర్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి జగన్నాథుడి దర్శనం

టీ మీడియా, నవంబరు 10, భువనేశ్వర్‌ : రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం భువనేశ్వర్‌ చేరుకున్నారు. ఈ ఉదయం వాయుసేన ప్రత్యేక విమానంలో బిజు పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి.. రాష్ట్ర గవర్నర్‌ గణేశీ లాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధదళాల నుంచి ఆమె గౌరవవందనం స్వీకరించారు.


అక్కడి నుంచి రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌లో నేరుగా పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లాక బొడొదండో ప్రాంతంలో కాన్వాయ్‌ని ఆపిన రాష్ట్రపతి.. అక్కడి నుంచి కాలినడక ఆలయానికి వెళ్లారు. దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. ఆమెకు స్వాగతం పలికిన చిన్నారులను పలకరించారు. ఆమె వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఉన్నారు.

Also Read : మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

దాదాపు గంట పాటు ఆమె ఆలయ సన్నిధిలో గడిపి ప్రత్యేక పూజలు చేశారు.దేశ ప్రథమ మహిళగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తన సొంత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి రాక సందర్భంగా నేడు భువనేశ్వర్‌లో స్కూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రపతి రెండు రోజుల పాటు ఒడిశాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం భువనేశ్వర్‌లోని మూడు స్కూళ్లు, ఆదివాసీ బాలల ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జయదేవ్‌ భవన్‌ వెళ్లి అక్కడ ఓ సాఫ్ట్‌వేర్‌ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని దిల్లీ తిరుగుపయనమవుతారని అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube