పీఎస్ఎల్వీ-సీ54 ప్రయోగం విజయవంతం
– 9 ఉపగ్రహాలతో నింగిలోకి రాకెట్
టీ మీడియా, నవంబర్ 26, శ్రీహరికోట : పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం రాకెట్‌ను ప్రయోగించింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువుగల ఓషన్ శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతోపాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాదాపు 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ ముగియగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ నింగిలోకి ఎగిరిపోయింది. ఓషన్ శాట్‌తోపాటు భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ దేశపు ఉపగ్రహం భూటాన్ శాట్‌ను కూడా నింగిలోకి పంపారు.
Also Read : ప్రమీలాదేవి మృతి మహిళా ఉద్యమాలకు తీరని లోటు
అదేవిధంగా బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనంద్ శాట్, హైదరాబాద్‌కు చెందిన ధ్రువ సంస్థ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్ట్ శాట్-2 ఉపగ్రహాలు, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ తయారుచేసిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ54 ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. రెండు గంటల వ్యవధిలో రాకెట్ ఈ 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెడుతుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.