వైభవంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..
లహరి, జనవరి 31, నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతిసమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.మెుదట వీరముష్టి వంశీయులతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలను ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పుల్లో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తరువాత తాము పండించిన పంటను స్వామి వారికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండుతాయని, ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల నమ్మకం
Also Read : ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఈ పూల మొక్కను పెంచుకోండి..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే అగ్ని గుండాల కార్యక్రమంలో తమ కోరికలు నెరవేరిన భక్తులు నిప్పుల్లో నడిచి మొక్కులు చెల్లించు కుంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. చేసిన పాపాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసమని ఆయన చెప్పారు. అగ్ని గుండాల కార్యక్రమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకపోవడంతో అధికారి యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎక్కడిక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరిని నిప్పులపై నడిచే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube