శ్రీనివాసమంగాపురంలో వైభవంగా రథోత్సవం
లహరి, ఫిబ్రవరి 18, తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుందని ఆలయ పండితులు తెలిపారు. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదని, భక్తుల హృదయాల్లో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞమని అన్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారని వివరించారు.
Also Read : శివుడికి కాశీ అంటేనే ఎందుకంత ఇష్టం?
ఫిబ్రవరి 19న చక్రస్నానం..
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం, ఉదయం 9.40 గంటలకు పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగుతుందని తెలిపారు.