బియ్యమా.. ఫైసలా !

రేషన్‌ దుకాణాల అక్రమాలు

1
TMedia (Telugu News) :

బియ్యమా.. ఫైసలా !
-లబ్ధిదారులను నేరుగా అడుగుతున్న డీలర్లు
– రూ.కోటి విలువైన సరకు పక్కదారి
-రేషన్‌ దుకాణాల అక్రమాలు
టీ మీడియా ఏప్రిల్ 10మహబూబ్‌నగర్‌: ఉమ్మడిమహబూబ్‌నగర్‌*జిల్లాలో ప్రతి నెలా 9.37 లక్షల కుటుంబాలకు 2.76 కోట్ల కిలోల బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అందులో 40 శాతం బియ్యం డీలర్ల వద్దనే ఉంచుకుని ఆ బియ్యాన్ని వారు నల్ల బజారుకు తరలిస్తున్నారు. ప్రతి నెలా సుమారు కోటి కిలోల బియ్యం కొందరు డీలర్ల ద్వారా వ్యాపారులకు, మిల్లులకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులకు ఇవ్వాల్సిన కోటి కిలోల బియ్యం స్థానంలో వారికి కిలోకు రూ.10 చొప్పున నగదు అందిస్తున్నారు. అంటే సుమారు రూ.10 కోట్లు నగదు రూపంలో డీలర్లు వినియోగదారులకు ఇస్తున్నారు. అలా మిగిల్చిన బియ్యాన్ని డీలర్లు బయట రూ.30 వరకు అమ్ముకుంటున్నారు.
ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల్లో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వినియోగదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేలిముద్ర వేయడం లేదా ఐరిస్‌ ప్రక్రియ పూర్తయిన తరవాత బియ్యాన్ని అందజేయాలి. ఇంట్లో ప్రస్తుతం ఒక్కో కుటుంబసభ్యుడికి 10 కిలోల బియ్యం ఇస్తారు. నలుగురు ఉంటే 40 కిలోల బియ్యం ఇస్తారు. లబ్ధిదారుల్లో 60 శాతం మంది బియ్యాన్ని తీసుకెళ్తుండగా, మిగతా 40 శాతం ఆసక్తి చూపడం లేదు. దీంతో పలువురు డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని బియ్యానికి బదులు కిలోకు రూ.10 చొప్పున ఇస్తున్నారు. దుకాణాలకు వచ్చేవారితో నేరుగా బియ్యం తీసుకెళ్తారా.. డబ్బులు కావాలా అని అడుగుతున్న డీలర్లు కూడా ఉంటున్నారు. అవసరం లేని వారు డబ్బు తీసుకుని వెళ్లిపోతున్నారు. కొందరు సగం బియ్యం తీసుకుని, మిగతా సగానికి డబ్బులు తీసుకుంటున్నారు.

Also Read : కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం

తనిఖీలు లేవు..
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలోని కొన్ని గ్రామాల్లో రేషన్‌ బియ్యాన్ని కొందరు డీలర్లు దళారులతో కలిసి నల్ల బజారుకు తరలిస్తున్నారని స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో శనివారం హల్‌చల్‌ చేసింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వినియోగదారుల నుంచి కొందరు రేషన్‌ డీలర్లు సేకరించిన బియ్యాన్ని బయట మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముకుంటున్నారు. ప్రతి రేషన్‌ దుకాణంలో విధిగా అధికారులు తనిఖీలు నిర్వహించి ఎంత బియ్యాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు.. దుకాణంలో ఇంకా ఎంత స్టాక్‌ ఉంది.. పరిశీలించాలి. దుకాణాల్లో పంపిణీ చేసిన వివరాల కంటే మిగిలిన బియ్యం అధికంగా ఉంటే సీజ్‌ చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలో తనిఖీలు ఎక్కడా సక్రమంగా జరగకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. రేషన్‌ దుకాణాల్లో బియ్యం నల్లబజారుకు తరలుతున్న సంఘటనలపై మహబూబ్‌నగర్‌ డీఎస్‌వో వనజాత, నారాయణపేట డీఎస్‌వో శివప్రసాద్‌, గద్వాల డీఎస్‌వో రేవతిల దృష్టికి తీసుకెళ్లగా అక్రమాలకు పాల్పడిన వారిపై 6ఎ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. దుకాణాల్లో డీటీలతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.10 వరకు చెల్లింపు
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం భగీరథ కాలనీ సమీపంలో ఉన్న ఓ రేషన్‌ దుకాణంలో అక్కడి నిర్వాహకులు బియ్యం కోసం వెళ్లే లబ్ధిదారులతో బియ్యం వద్దంటే చెప్పండి.. కిలోకు రూ.10 చొప్పున ఇస్తాం అంటూ బేరానికి దిగుతున్నారని స్థానికులు చెప్పారు.

Also Read : ముత్యాల తలంబ్రాల వితరణ

మహబూబ్‌నగర్‌ పురపాలిక పరిధిలో మొత్తం 98 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఈ రేషన్‌ దుకాణానికి గత నెలలో 19 లక్షల కిలోల రేషన్‌ బియ్యాన్ని వినియోగదారులు అందించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అందులో 40 శాతం వరకు బియ్యం వినియోగదారులకు వెళ్లకుండా నేరుగా డీలరు నుంచి నల్ల బజారుకు తరలుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు దుకాణాల్లో ఈ దందా నడుస్తోంది. దీంతోపాటు నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం బియ్యానికి బదులు ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. కిలోకు రూ.10 చొప్పున లెక్కకట్టి ఆ డబ్బులకు సరిపడా కందిపప్పు, ఉప్పు, గోధుమ పిండిలను అందిస్తున్నారు. వనపర్తి జిల్లాలో వినియోగదారులకు బియ్యాన్ని బస్తాతో కలిపి తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
బియ్యమా.. ఫైసలా !
వనపర్తి : రేషన్‌ దుకాణంలో బియ్యం తీసుకోవడానికి వచ్చిన కార్డుదారులు
మహబూబ్‌నగర్‌ 525 2,40,600
జోగులాంబ గద్వాల 333 1,60,588
నాగర్‌కర్నూల్‌ 558 2,38,866
నారాయణపేట 298 1,40,233
వనపర్తి 325 1,57,384

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube