అదానీ గ్రూపు కంపెనీలకు బ్యాంకు రుణాలపై ఆర్‌బీఐ ఆరా
అదానీ గ్రూపు కంపెనీలకు బ్యాంకు రుణాలపై ఆర్‌బీఐ ఆరా
అదానీ గ్రూపు కంపెనీలకు బ్యాంకు రుణాలపై ఆర్‌బీఐ ఆరా
టీ మీడియా, ఫిబ్రవరి 2, న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్‌లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్కెట్లలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ గ్రూపు కంపెనీలతో పాటు ఆయా సంస్దలకు రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల షేర్లు కూడా నేలచూపులు చూస్తున్నాయి. ఎల్ఐసీ సహా పలు బ్యాంకులు అదానీ గ్రూపునకు భారీగా రుణాలిచ్చిన క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అదానీ గ్రూపునకు బ్యాంకు రుణాల వ్యవహారంపై కన్నేసి ఉంచింది. అదానీ గ్రూపు కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా స్ధానిక బ్యాంకులను ఆర్‌బీఐ కోరిందని సమాచారం. గత వారం నుంచి అదానీ గ్రూపు కంపెనీలు దాదాపు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయిన క్రమంలో కేంద్ర బ్యాంక్ అప్రమత్తమైంది. అదానీ గ్రూపునకు బ్యాంకు రుణాలపై ఆర్‌బీఐ ఆరా తీస్తోందని బ్యాంకింగ్, ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించినా కేంద్ర బ్యాంక్ అధికారికంగా స్పందించలేదు. ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు గ్రూపు చీఫ్, బిలియనీర్ గౌతం అదానీ వీడియో స్టేట్‌మెంట్ వెల్లడించినా గురువారం సైతం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం కొనసాగింది.
Also Read : బెల్లం వేసిన పాలను తాగితే.?
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓను రద్దు చేసినట్టు కంపెనీ ప్రకటించిన తర్వాత కూడా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ వంటి లిస్టెడ్ కంపెనీలు 5 నుంచి 10 శాతం పైగా నష్టపోయాయి. అంబుజా, ఏసీసీ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. అదానీకి చెందిన ఎన్‌డీటీవీ షేర్ కూడా మార్కెట్ ఆరంభంలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అదానీ గ్రూప్ రుణభారం, షేర్ విలువను పెంచేందుకు అక్రమాలకు పాల్పడటం, పన్నుల ఎగవేత కోసం పక్కదారులు తొక్కడంపై గత వారం హిండెన్‌బర్గ్ నివేదిక సంచలన విషయాలను బహిర్గతం చేసినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం మొదలైన విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube