మార్చిలో అందుబాటులోకి ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు
టీ మీడియా, ఫిబ్రవరి 20, హైదరాబాద్ : రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ తరుణంలో ప్రయివేట్ ట్రావెల్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో టీఎస్ ఆర్టీసీ ఈ బస్సులను నడపనుంది. ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా అని పేరు పెట్టారు.