ఆర్టీసీ ఛార్జీలు పెంచింది
టి మీడియా,ఏప్రిల్ 09,హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండప్, టోల్ ప్లాజాలు, పాసింజర్స్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా డీజిల్ సెస్ పేరుతో మరోసారి పెంచింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రెండు రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 కొనసాగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆర్టీసీ 6లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని, ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా అసాధారణ రీతిలో పెరిగిపోవడంతో డీజిల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయించామని, ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. 2021 డిసెంబరులో రూ.85లు ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.118కి ఎగబాకడంతో డీజిల్ సెస్ విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Also Read : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube