డిసెంబర్‌లోపు విశాఖకు మారతాను
-విశాఖ నుంచే పాలన
– సిఎం జగన్
టీ మీడియా, అక్టోబర్ 16, విశాఖపట్నం : ” డిసెంబర్‌లోపు విశాఖకు మారతాను. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం ” అని సిఎం జగన్ అన్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని రుషికొండలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు సిఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర అంటే డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని జగన్ అన్నారు. వైజాగ్ కూడా ఐటి హబ్‌గా మారుతుందని, ఇప్పటికే విద్యాసంస్థల కేంద్రంగా మారిందన్నారు. ఏటా 15 వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖ అని… అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతం అని చెప్పారు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని హర్షాన్ని వ్యక్తం చేశారు. కంపెనీలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : గాజాలో ఇజ్రాయెల్ బలగాలు సుదీర్ఘకాలం ఉంటే పెద్ద పొరపాటే
” త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం ” అని సిఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ అధికారులు మాట్లాడుతూ.. ఎపిలో హైబ్రీడ్ వర్కింగ్ మోడల్‌లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి నిపుణులకు కొదవలేదని అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube