ఉద్యోగాల కోసం భూముల కుంభకోణం
-బీహార్‌లో ఇడి సోదాలు
టీ మీడియా,మార్చి 10,పాట్నా : ఉద్యోగాల కోసం భూముల కుంభకోణం కేసులో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) శుక్రవారం బీహార్‌లోని పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంలో లింక్ ఉన్న కొందరు ఆర్‌జెడి నేతలతోపాటు, పాట్నా, పుల్‌వారీ షరీఫ్ వంటి పట్టణాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఇడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో బీహార్ మాజీ సిఎం లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు ఆయన సతీమణి రబ్రీ దేవిని కూడా ఇటీవల ఇడి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల దగ్గర నుంచి బహుమతిగా భూముల్ని తీసుకున్నారన్న సిబిఐ ఫిర్యాదు మేరకు ఇడి ఈ సోదాలు నిర్వహిస్తోంది. లాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవితోపాటు మరో 14 మందిపై సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద వీరిపై సిబిఐ కేసు నమోదు చేయడంతో ఇడి దర్యాప్తు ప్రారంభించింది.